హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ జోరు పెంచింది. కొందరు నేతలు, వ్యక్తులు చేసిన పోస్టింగులను జత చేస్తూ గతంలో న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు సీజేకి లేఖ రాశారు. ఆయా పోస్టులు చేసిన వ్యక్తులు, అందులో వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్ష్మీనారాయణ నుంచి సీబీఐ అధికారులు వివరాలు తెలుసుకున్నారు.
'న్యాయమూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా?... తొలుత పోస్టులు పెట్టిన వారు ఆ తరువాత వాటిని తొలగించారు కదా?... ఆ పోస్టుల సమాచారం మీ దగ్గర ఉందా?... ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఏమైనా ఉందా?' అని న్యాయవాది లక్ష్మీనారాయణను సీబీఐ ఆరా తీసింది. వివరాలు ఉంటే తమకు అందించి విచారణకు సహకరించాలని సీబీఐ అధికారులు కోరారు. న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి?.. వాటిని ఎవరు చేయించారు? అనే అంశాలకు సంబంధించి కొన్ని కీలక పత్రాల్ని సీబీఐ అధికారులకు అందజేశానని విచారణ అనంతరం న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
'వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, ఆ పార్టీ నాయకులు ఆమంచి కృష్ణమోహన్, పండుల రవీంద్రబాబు తదితరులు న్యాయమూర్తుల్ని, న్యాయవ్యవస్థల్ని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రసారమయ్యాయి. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారికి అండగా ఉంటామంటూ ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు పంచ్ ప్రభాకర్ ప్రకటనలు చేశారు. మీడియాలో అవన్నీ లభ్యమవుతాయి. వీటన్నింటిపై దృష్టి సారించాలి' అని సీబీఐ అధికారులను తాను కోరినట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు.
రెండు, మూడు రోజుల్లో విచారణ
హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యంతరకర పోస్టులపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ 17 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. వీరందరికీ నోటీసులు జారీ చేసి... రెండు, మూడు రోజుల్లో విచారించనున్నట్లు సమాచారం. 8 వారాల్లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినదున.... ఇప్పటికే గుర్తించిన నిందితుల్ని విచారించాలని భావిస్తోంది. తర్వాతి దశలో మిగిలిన వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన సీఐడీ నుంచి వివరాలు తీసుకున్న సీబీఐ.... మొత్తం 96 మంది అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి