Car crashed into crop canal: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెద్దపులిపాక పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపులిపాక పరిధిలో ఓ పంట కాలువలోకి కారు దూసుకెళ్లగా.. అందులోని వ్యక్తి ఆచూకీ తెలియడం లేదు. గల్లంతయ్యారా? లేక కారు కాలువలో పడిపోయిన తర్వాత అందులోని వ్యక్తి బయటకు వచ్చి ఎక్కడికైనా వెళ్లిపోయారా? అనేది ఇంకా తేలడం లేదు. ఆదివారం రాత్రి పది గంటల తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా గల్లంతైన వ్యక్తి అవనిగడ్డ ఐదో వార్డుకు చెందిన గాజుల రత్నభాస్కర్‌గా పోలీసులు నిర్ధారించారు. రత్న భాస్కర్ ఆదివారం విజయవాడలో జరిగిన టీడీపీ సమావేశానికి హాజరైనట్లు.. అతను టీడీపీ నేత బూరగడ్డ వేద వ్యాసు సన్నిహితుడిగా తెలుస్తోంది. సమావేశం పూర్తయిన అనంతరం అతను కారులో బయలుదేరి వెళ్లినట్లు వేదవ్యాస్ తెలిపారు.
అనేక అనుమానాలు వ్యక్తం.. కారు పంట కాలువలోని నీటిలో మునిగినట్లు కనిపిస్తుండగా.. కారు అద్దాల్లోంచి లోపల పరిశీలించగా.. అందులో ఎవరూ లేరని ఈతగాళ్లు పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గల్లంతైన రత్నభాస్కర్ వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించేవారని.. చాలా వ్యాపారాలను ప్రారంభించి మధ్యలోనే అవి కలిసి రాకపోవడంతో మధ్యలోనే వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రత్నభాస్కర్ స్వస్థలం బంటుమిల్లి కాగా అక్కడే అయిదు నెలల క్రితం కోటి రూపాయల వ్యయంతో ఐస్ ఫ్యాక్టరీని ప్రారంభించి నిర్వహిస్తున్నట్లు సమాచారం.
భార్యకు పెదపులిపాక లోకేషన్.. పోలీసులు కారు వెలికి తీసే క్రమంలో కారులోని మొబైల్ ఫోను, ఒక జత బట్టలు పోలీసులకు లభించాయి. అదేవిధంగా ఆదివారం రాత్రి గల్లంతైన రత్నభాస్కర్ మొబైల్ నుంచి అతని భార్యకు పెదపులిపాక లోకేషన్‌ను షేర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలో కాలువలో నీటి ప్రవాహం తక్కువగానే ఉందని.. అదే విధంగా కారు డోర్ తెరిచి ఉంచడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్థిక సమస్యలతో జరిగిన ఏదైనా కుట్ర.. లేక ఎవరైనా అతన్ని అపహరించి కారు కాలువలోకి తోసేసారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐదు కోట్ల రూపాయల వరకు అప్పులు.. గల్లంతైన రత్నభాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. గజ ఈతగాళ్ల సహాయంతో పంటకాలువలో గాలింపు జరిపిస్తున్నారు.. ఆర్ధికంగా సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం.. వ్యక్తి గల్లంతుపై అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదవశాత్తు కారు పంట కాలువలో పడిందా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పెనమలూరు సిఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అతనితో పాటు ఎవరున్నారు కారులో ఎవరైనా ప్రయాణించారా.. అనే దానిపై విచారణ జరుపుతున్నాం.. ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా.. ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై విచారణ జరుపుతున్నాం.- జయసూర్య, డీఎస్పీ