చంద్రబాబుపై దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని వదిలేసి, తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో ప్రజలు పోలీసులపై తిరగబడే రోజు వస్తుందన్నారు.
'జోగి రమేష్‌పై బెయిలబుల్ సెక్షన్లా? గొడవను అడ్డుకున్న మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులా? ఎస్సీల పేరుతో మేం దూషించామా... నిరూపించండి. తప్పుచేసిన వారిని వదిలేసి మాపై కేసులు పెడుతున్నారు. పోలీసు అధికారుల సంఘం ప్రభుత్వ పెద్దలకు వంతపాడటం మానాలి. మాపై అన్యాయంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి. మాకు న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తాం.'-బుద్దా వెంకన్న, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
2024ఎన్నికలలో తెదేపా అధికారం లోకి రావడం ఖాయమని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని.. ఫలితాలు తరువాత వైకాపా నేతలు గెలిచామని జబ్బలు చరుస్తున్నారని గుర్తు చేశారు.
వైకాపా గెలిచిందని గొప్పలు చెప్పుకుంటోంది: నక్కా ఆనంద్ బాబు
తెదేపా బహిష్కరించిన ఎన్నికల్ని నిర్వహించుకున్న వైకాపా గెలిచామని గొప్పలు చెప్పుకుంటోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. వ్యవ్థలన్నీ మోసం చేసిన జగన్ రెడ్డి ఎన్నికల్ని మోసకారి విధానంగా మార్చారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజకీయ విభేదాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. వైకాపా నియమించిన వాలంటీర్లు గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు.
మైనార్టీలపై దాడులు కనిపించడం లేదా?
ముస్లిం మైనార్టీలపై వరుస దాడులు ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషాకు, ఇతర వైకాపా నేతలకు కనిపించట్లేదా అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ మండిపడ్డారు. "పోలీసుల కారణంగానే అబ్దుల్ సలాం కుటుంబం చనిపోయిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తేల్చినందున అంజద్ భాషా, మహ్మద్ ఇక్బాల్ లు సమాధానం చెప్పాలి. అధికార పార్టీ ముస్లిం శాసనసభ్యులకు మైనార్టీలపై దాడులు కనిపించట్లేదా. మైనార్టీలపై దాడుల్ని అడ్డుకోవటానికి రాని చేతులు జగన్ కు పాలాభిషేకాలు చేసేందుకు మాత్రం వస్తున్నాయి. వైకాపా పెద్దల కోసమే పోలీసులు మైనార్టీలను వేధించి చంపేస్తున్నారు." అని ఆరోపించారు.
సంబరాలు జరుపుకోవటం హాస్యాస్పదం..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపాకి దక్కిన విజయం... దౌర్జన్యంతో వచ్చింది కానీ ప్రజాతీర్పు కాదని గుడివాడ తెదేపా అధ్యక్షుడు రాంబాబు అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో వైకాపా శ్రేణులు అఖండ విజయం సాధించామని సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
తెదేపా బహిష్కరించిన పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి, వైకాపా ఏకపక్ష విజయం ఏంటని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ఊహించిన గెలుపుకి బాజాలు అవి... ఎలక్షన్స్ కాదు సెలక్షన్స్ అని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారని ఎద్దేవా చేసారు. అందుకే తెదేపా నామమాత్రంగా పోటీ చేసిందని పేర్కొన్నారు. "రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది. ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి అధికారాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో పెట్టుకొని పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. అందుకే తెదేపా ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. మిగిలి ఉన్న కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టి చూడండి తేదేపా ప్రజా బలం ఏంటో తెలుస్తుంది. వినాయక చవితికి కోవిడ్ పేరుతో నిబంధనలు పెట్టి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రుడా చైర్మన్ షర్మిలారెడ్డి కార్యక్రమాల్లో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇది ఎక్కడి న్యాయం...? రైతుల పక్షాన పోరాటం చేస్తూ తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కేసు పెట్టడం దారుణం" అని అన్నారు
ఇదీ చదవండి: