ఆగి ఉన్న లారీలో విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన బ్లేడ్ బ్యాచ్‌ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. మత్తు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు విజయవాడ నుంచి గన్నవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాల డ్రైవర్లను బ్లేడ్లతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న ఇద్దరు లారీ డ్రైవర్లను బ్లేడులతో గాయపరిచి వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నారు.
బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భవానిపురానికి చెందిన పాత నేరస్తులైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడీకి వినియోగించిన బ్లేడ్లు, ఐదు కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని విజయవాడ తూర్పు మండల ఏసీపీ రమేష్ తెలిపారు. వ్యసనాలకు బానిసలైన యువకులు గతంలో భవానిపురం పరిధిలో పలు నేరాలకు పాల్పడ్డారని... అంతేగాక ద్విచక్ర వాహనాలు చోరీ చేసేవారని తెలిపారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరలో నగర బహిష్కరణ చేసే ఆలోచన ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.