Somu veerraju: తెదేపా అధినేత చంద్రబాబు దార్శనికుడు కాబట్టే నాడు కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వివిధ రూపాల్లో రూ.8,500 కోట్ల నిధులివ్వడానికి సిద్ధపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ దార్శనికుడు కాదు కాబట్టే ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడు రాజధానులంటూ జగన్ కనీసం మూడు రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. రాజధానిని నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. భూములను ఆక్రమించడానికే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. చివరికి రాజధాని లేకుండా చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేశారు. కాబట్టే రాజధాని కోసం రైతులు, భాజపా యాత్రలు చేయాల్సి వస్తోంది. అమరావతిని నిర్మించుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తే కేంద్రం రహదారులు నిర్మిస్తుంది. మౌలిక వసతులు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మిస్తాం’’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
బండారం బయటపడుతుందనే..
‘‘పోలవరం కట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబితే కేంద్రమే నిర్మిస్తుంది. ఎంతసేపూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.కోట్లు ఎలా వెనకేసుకుందామా అనే ఆలోచనే తప్ప వైకాపా నాయకులకు మరొకటి లేదు. పంచాయతీల నిధులు దారి మళ్లించడం, జలజీవన్ మిషన్ నిధుల్ని ఖర్చుపెట్టకపోవడం, కార్పొరేషన్‌లు సృష్టించి అప్పులు తేవడం, టెండర్ వేయడానికి ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడమేనా ఆర్థికంగా బాగుండమంటే. దేశంలో ఒక్క ఏపీలోనే ఉపాధి హామీ పథకంలో అత్యధిక అవినీతి జరిగింది’’ అని పేర్కొన్నారు.
ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
‘‘ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని దళిత వాడల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులకు పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు గుంటూరులో నిర్వహించే రాష్ట్ర ఎస్సీ మోర్చా శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. ఎస్సీల్లో అక్షరాస్యత ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ.. ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తిలోదకాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే తమ లక్ష్యమని అన్నారు.
ఇవీ చదవండి: ఆ డబ్బు కోసం పోరాడాల్సి వస్తోంది: అమరావతి జేఏసీ నేత బొప్పరాజు