BJP Purandeshwari Comments on Janasena Alliance చంద్రబాబు నాయుడు అరెస్టును ముందుగా ఖండించింది బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతోనే కొనసాగుతున్నారని, మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని విజయవాడలోని కోమల విలాస్ సెంటర్లో పేదలకు చీరలు పంపిణీ చేశారు.
Political Leaders Comments On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్..ఖండించిన పలువురు నాయకులు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా జనసేన పార్టీ పొత్తు కుదుర్చున్న వేళ.. బీజేపీ స్పందన గురించి పురందేశ్వరిని మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'తాము ఎన్డీయేలోనే ఉన్నామని... బీజేపీ (BJP)తోనే ఉన్నామని... నరేంద్రమోదీతోనే ఉన్నామని... జనసేన ఎన్డీయేలో భాగమేనని... ఎన్డీయే (NDA)నుంచి బయటకు రావడం లేదని... మరోసారి ప్రధానిగా మోదీని చూడాలనే తన బలమైన ఆకాంక్ష అని' పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై పురందేశ్వరి ఆచితూచి స్పందించారు.
తమ పార్టీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని.. జనసేన (Janasena)పార్టీ తమ పార్టీతో పొత్తులోనే ఉందన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తమతో చర్చించిన సమయంలో తాము తమ అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తొలుత తప్పు పట్టింది బీజేపీయేనని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన చేశామన్నారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఐడీ పని చేస్తోందన్న పురందేశ్వరి... చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమన్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ లో... మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, పార్టీ ఎన్టీఆర్ జిల్లా (NTR District)అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాంతో కలిసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అంత్యోదయ అనేది బీజేపీ మూల సిద్ధాంతమని... ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశ్వ కర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చారని... చేతి వృత్తులపై ఆధారపడిన హస్త కళాకారులకు రుణాలు మంజూరు చేస్తున్నారని వివరించారు. సేవకు బీజేపీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని చెప్పారు. నరేంద్రమోదీ (Narendra Modi) తాను ప్రధాని అని కాకుండా.. దేశ సేవకుడిని అనే భావనతోనే పనిచేస్తున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.