BJP Leaders Reaction About Alliances: పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలో రెండో రోజు బీజేపీ పదాధికారులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి, సార్వత్రిక ఎన్నికల కసరత్తులపై సమావేశంలో చర్చించారు. పొత్తులు, ఇతర అంశాలపై నాయకులు, కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి నివేదించనున్నట్లు పురందేశ్వరి తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు.
కృష్ణాతీరంలోని గోకరాజు గంగరాజు అతిథి గృహంలో ఈ సమావేశానికి పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరితో పాటు సుమారు 40 మందికిపైగా ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. రానున్న ఎన్నికలకు పార్టీ ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగాలనే విషయమై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
సంస్థాగతంగా పార్టీ బలోపేతంతో పాటు వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ వ్యతిరేక పాలన గురించి, ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పొత్తులపైనా విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా పార్టీ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శికి అందించారు.
సార్వత్రిక ఎన్నికలపై పురందేశ్వరి కీలక సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయనే విషయం వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు అర్ధమవుతోందని, కేంద్ర ప్రభుత్వం పథకాలు, వాటి లబ్ధిని ఎక్కువగా ప్రజలకు చేరువ చేయడంలో పార్టీ కాస్త వైఫల్యం చెందిన మాట వాస్తవమేనని నేతలు ఈ సమావేశంలో అంగీకరించారు.
తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తమ పార్టీని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని కోరుతున్న విషయం వాస్తవమేనని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. అయితే దీనిపై ఆ పార్టీ నాయకులు, తమ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఈ చర్చకు ముగింపు పలకాలని తాము ఆశిస్తున్నట్లు సమావేశం అనంతరం సత్యకుమార్ తెలిపారు. తమ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే వారిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే, కొన్ని షరతులు పెట్టారు.
రాష్ట్రంలోని ప్రతి పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది: పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర నేతల సమావేశం ముగిసిన కాసేపటికే శివప్రకాష్, పురందేశ్వరితో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికపై ఆచితూచి స్పందించిన బీజేపీ నేతలు, సంస్థాగతంగా తమ పార్టీ బలోపేతమే తమకు ముఖ్యమని, ఆమె ఏ పార్టీలో చేరినా తమకెందుకని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ దొంగ ఓట్లను నమోదు చేస్తోంది : పురందేశ్వరి