ప్రజానీకం అంతా కరోనా భయంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతుంటే... రాష్ట్ర ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని ఆలోచించట్లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్ ఉన్నవారికీ వేల రూపాయల బిల్లులు జారీ చేయడం చూస్తే... ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు.
ఈ బిల్లులపై ప్రజలు ఆందోళన చెందుతున్నా.. మంత్రులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బిల్డ్ ఏపీ పేరుతో ఆస్తులను అమ్మి రాష్ట్రాన్ని నిర్మిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను జనసేన శ్రేణులు నిలదీయాలని పిలుపునిచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు... రాష్ట్ర వ్యాప్తంగా భాజాపాతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు.
అధిక విద్యుత్ బిల్లులు, భూముల వేలంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని శ్రేణులను కోరారు. ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లులను తక్షణం రద్దు చేసి ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని, భూముల వేలానికి సంబంధించిన ఉత్తర్వును రద్దు చేయాలని డిమాండ్ చేయాలన్నారు.
ఇదీ చూడండి: