BJP approached TS High Court on buying TRS MLAs తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార తెరాస, భాజపా నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ భాజపా హైకోర్టును ఆశ్రయించింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఘటనపై సిట్‌ను నియమించాలని పిటిషన్‌లో కోరింది.
పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలను కొందరు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్ పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
ఇవీ చూడండి: