రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రహదారులను పునర్ నిర్మించాలంటూ.. భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని రహదారులు నిర్మించారు.. ఎన్నింటికి మరమ్మతులు చేశారో పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ మెగల్రాజపురం మధుచౌక్‌లో రోడ్ల దుస్థితిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వత్సవాయి, మైలవరం మండలాల్లో భాజపా నిరసన తెలిపింది.
ప్రధాన కూడళ్లలో భారీ గుంతలు ఏర్పడ్డాయని.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని.. అందుకే కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని భాజపా నేతలు ఆరోపించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇతర సంస్థల్లో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ ఖర్చు చేయకుండా వైకాపా ప్రభుత్వం బదలాయిస్తోందని విమర్శించారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.723 కోట్లు ఇస్తే... గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా నిధులు మళ్లించారని అన్నారు. సంబంధిత శాఖల నుంచి నిధుల వినియోగ పత్రాలను ఇవ్వకపోవడం కారణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండో దపా రావాల్సిన రూ. 680 కోట్లు నిలిచిపోయాయని భాజపా నేతలు అన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ర్యాలీ భగ్నం.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్