కార్తిక శుద్ద విదియను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వివిధ వర్ణాల గాజులతో దుర్గమ్మను అలకరించారు. ఏటా పది లక్షలకుపైగా గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలకరిస్తుంటారు. కానీ ఈసారి కొవిడ్ నేపథ్యంలో దాతల నుంచి విరాళంగా వచ్చిన రెండు లక్షల గాజులతో ఆలయ ప్రాంగణం వరకే అలంకరించారు. ఈ అలంకరణ కోసం మహిళలు గాజులను దండలుగా చేశారు.
ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనంతోపాటు మల్లేశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేయించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పూజించేందుకు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఇదీ చదవండి: కార్తిక మాసంలో పూజలు... జన్మ జన్మలకు పుణ్యం