జలరవాణకు అత్యంత అనుకూలంగా ఉండటం మచిలీపట్నం తీర ప్రాంత ప్రత్యేకత. వందేళ్ల క్రితమే పోర్చుగీసు వారి హయాంలోనే ఈ ఓడరేవు నిర్మించారు. ఇక్కడి నుంచి పలు దేశాలకూ తక్కువ సమయంలో సరుకులు చేరవేసే అవకాశం ఉంటుంది. డచ్ వారు, బ్రిటీష్ వారు కూడా ఇక్కడి నుంచే వాణిజ్య కార్యకలాపాలు సాగించినట్లు ఇప్పటికీ ఆనవాళ్లు ఉన్నాయి.
5వేల ఎకరాల్లో నిర్మాణం..
మచిలీపట్నం పోర్టును 5 వేల ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముందుగా రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టారు. పోర్టు నిర్మాణానికి సుమారు 12 కోట్ల అంచనాలతో నిధులు సమకూర్చారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కి ప్రభుత్వం పూచికతు ఇచ్చి పలు బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించింది . పోర్టు నిర్మాణం సహా ఇక్కడి నుంచి సముద్రంలోకి 20 కిలోమీటర్ల మేర డ్రించింగ్ చేసి మార్గం వేయనున్నారు. డ్రించింగ్ చేసే యంత్రాల వద్ద ఇవాళ సీఎం చంద్రబాబు పూజలు చేసి, పనులను ప్రారంభిస్తారు. పోర్టు పరిధి ప్రారంభమయ్యే ప్రాంతంలో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ సదుపాయాలు
అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుంది. చెన్నై- విశాఖ పట్నం పోర్టులకు ధీటుగా బందరు పోర్టు ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ పోర్టుల నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బ్రేక్ వాటర్ విధానంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
టౌన్‌షిప్‌ల నిర్మాణం.
నాలుగైదు చోట్ల ముడా తరఫున టౌన్‌షిప్‌లు కూడా నిర్మించేలా ప్రతిపాదనలు పెట్టారు. సాగరమాల కింద 15వందల కోట్లు మంజూరుకాగా...దీని ద్వారా రహదారుల అనుసంధానం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పలు మధ్య భారత రాష్ట్రాలకు ఈ ఓడరేవు అతిదగ్గరగా ఉంటుంది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ఈ పోర్టు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. నిర్మాణ రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న నవయుగ సంస్థకు పోర్టు పనులు అప్పగించారు.