కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాలని కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని అన్నారు. సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెనుగంచిప్రోలులో కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు వివరించారు.
గుంటూరు జిల్లాలో...
కరోనా వైరస్ పై గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పట్టణంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా పట్టణంలోని అన్ని రకాల వ్యాపార సంస్థలను మూసివేయాలని తెలిపారు.
కర్నూలు జిల్లాలో..
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ప్రజలను కోరారు. కరోనా అనుమానితులను గుర్తించి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా తునిలో పట్టణ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ ఎలా సోకే అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యక్తిగత పరిశుభ్రత అంశాలపై సీఐ రమేష్ బాబు వివరించారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను సిబ్బంది పంపిణీ చేశారు.
రంపచోడవరంలో..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్టు తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అన్నారు. రంపచోడవారానికి చెందిన ఇద్దరు విదేశాల నుంచి వచ్చారని వారికి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఏజెన్సీలో పది రోజుల పాటు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు మూసేశారు. ఏజెన్సీలో వారపు సంతలను పెట్టవద్దన్నారు. ఆదివారంనాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ బయటకు రాకుండా ఉండాలన్నారు.
తిరుపతిలో...
కరోనా వైరస్ వ్యాపించకుండా తిరుపతి నగరంలో విస్తృత చర్యలు చేపట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తిరుపతి నగరానికి 128 మంది వచ్చినట్లు గుర్తించారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ నుంచి ఇద్దరు, దుబాయ్ నుంచి ఆరుగురు ఉండటంతో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎనిమిది మంది ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చిన రోగి ప్రయాణం చేసిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో ప్రయాణించి తిరుపతికి చేరుకొన్న వారితో పాటు....ఆ రైలు ప్యాంట్రీ కారులో సేవలు అందించిన 12 మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించి పర్యవేక్షిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కరోనా వైరస్ పై అత్యవసర అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: