కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామపంచాయతీలోని రేగుల్లంక గ్రామమిది. పులిగడ్డ వద్ద కృష్ణా నది రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ హంసలదీవి సాగర సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరొక పాయ, ఎదురుమొండి వద్ద సాగరంలో కలుస్తుంది. రెండు పాయలుగా విడిపోయే ప్రదేశంలోనే... రేగుల్లంక గ్రామం ఉంది. దీంతో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా... ఆ ప్రవాహ వేగానికి గ్రామం కొద్దికొద్దిగా నీటిలో కలిసిపోవడం ప్రారంభమైంది. ఇప్పటికే సాగుభూమితో పాటు 50 ఇళ్లు విరిగిపోయి... నదీ గర్భంలో కలిసిపోయాయి.
ఇటీవల కృష్ణానదికొచ్చిన వరదలకు గ్రామం మరింత మునిగిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే తమ గ్రామం పూర్తిగా ఉనికి కోల్పోతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమస్యకు పరిష్కారంగా 1965 నుంచి ఏర్పాటు చేస్తామన్న క్రాస్‌బండ్‌లు..... ప్రణాళికల దశలోనే ఆగిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా వాటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.