ap new districts: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో అనంతపురంలో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మార్చి 3వ తేదీ వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల విభజనపై ఇప్పటివరకు 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. ముఖ్యంగా హిందూపురం, రాజంపేటను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలనే వినతులు ఎక్కువగా వచ్చాయని వెల్లడించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. జిల్లాల సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా పెరుగుతోందన్నారు.
అనంతపురం జిల్లాలోని రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోందన్నారు విజయ్ కుమార్. కర్నూలు జిల్లాలోని పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలులో కలపాలని వినతులు వచ్చాయని పేర్కొన్నారు. వీటన్నింటిని ఆయా జిల్లాల కలెక్టర్లు క్రోడికరించుకుని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి పంపిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై నిర్ణయం తీసుకుని తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప జోన్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారు.
ఇదీ చదవండి
Russia Ukraine War: 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం: కృష్ణబాబు