రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయించాలంటూ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో రెండు లైన్ల రోడ్లపై టోల్ వసూలు ఆలోచన విరమించుకోవాలని.. వ్యాట్‌కు అదనంగా పెట్రోల్, డీజిల్ పై అదనంగా విధించిన రూ.4 ను తగ్గించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాట కార్యాచరణ సిద్దం చేసేందుకు విజయవాడలో వారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలపై చర్చించిన లారీ యజమానులు.. తాము పడుతున్న కష్టాలను వివరిస్తూ 12 అంశాలతో రవాణాశాఖ మంత్రి పేర్నినానికి మూడు పేజీల లేఖను రాశారు.
డిమాండ్లను వెంటనే పరిష్కరించండి..
రవాణా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించాలని లారీ యజమానులు కోరారు. దేశంలో ఎక్కడా లేని 'లేబర్ సెస్'ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు తెలిపారు. ప్రతి లారీకి ఏటా రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారని, అది రద్దు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణాకు లారీలను అనుమతించాలని.. నష్టదాయకంగా మారిన జీవో 21 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆదేశాల మేరకు లారీలకు రాష్ట్ర ప్రభుత్వం మినిమం ప్రైట్ రేట్ నిర్ణయించాలని కోరారు. ఏపీ , తెలంగాణ మధ్య సరకు రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. లారీ ఉన్న వారికి తెల్లరేషన్‌కార్డులు రద్దు చేయవద్దని విన్నవించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలకు దిగుతామని సంఘం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: