Lorry Owners Association Demands Withdrawal of Tax Hike: సరకు రవాణా వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం త్రైమాసిక పన్నును వెంటనే ఉపసంహరించాలని ఎపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా పన్నుల భారం విధించడం దారుణన్నారు. తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా త్రైమాసిక పన్నును ఒకేసారి 30 శాతం పన్ను పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు.
రవాణా వాహన యజమానులు చాలా కష్టాల్లో ఉన్నారని, తమ సమస్యల తీర్చాలని పలుమార్లు సీఎం జగన్‌కు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డీజిల్ రేట్లు పెంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కంటే రాష్ట్రంలో లీటర్ డీజిల్ 12 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు.
గ్రీన్ సెస్‌ను కర్ణాటకలో 200, తమిళనాడులో 500 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా పెంచారన్నారు. ఓవర్ హైట్ కేసులకు జరిమానా గతంలో వెయ్యి రూపాయలుండగా.. ఇప్పుడు దానిని పెంచి 20 వేలు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధికంగా లేబర్ సెస్, రోడ్ సెస్ వసూలు చేస్తూ.. రోడ్లు మాత్రం వేయడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉండటం వల్ల టైర్లు దెబ్బతిని నిర్వహణ వ్యయం పెరగడం వల్ల లారీలు తిప్పే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నుల బాదుడు వల్ల లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పలువురు ఇతర రాష్ట్రాలకు లారీలను తరలిస్తున్నారన్నారు.
కర్ణాటక నుంచి డీజిల్ స్మగ్లింగ్ జరుగుతోందని, ఉన్నతాధికారులకు తెలిసినా నివారణ కోసం చర్యలు తీసుకోవడం లేదని, సంబంధం లేని పెట్రోల్ బంకులపై అధికారులు దాడులు చేస్తున్నారన్నారు. వీటన్నింటి వల్ల కిస్తీలు కట్టకపోవడం వల్ల ఇప్పటికే 40 వేల లారీలను ఫైనాన్స్ వారు పట్టుకు పోయారని, మిగిలిన లారీలను ఎక్కడికక్కడ ఆపివేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. లారీలను రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తాము చేసుకున్న తప్పా అని ప్రశ్నించారు. వెంటనే పెంచిన పన్నులను తగ్గించాలని లేనిపక్షంలో లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతలంతా సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
"మన రాష్ట్ర ప్రభుత్వం 2023 జనవరి 11వ తేదీన జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. దీని ప్రకారం త్రైమాసిక పన్నులు 25 నుంచి 30 శాతం పెంచుతామని అన్నారు. మిగిలిన రాష్ట్రాల కన్నా.. మన రాష్ట్రంలో డీజిల్‌పై అదనంగా 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం". - వైవీ ఈశ్వరరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: