కోర్టు ఆదేశాల మేరకు ఎంత మంది పిటిషనర్లకు సకాలంలో ఉపాధి బిల్లులు చెల్లించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల్ని ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతనెల 23 న ఇచ్చిన ఆదేశాలతో రెండు వారాల్లోపు ఎంతమందికి ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని స్పష్టంచేసింది. ఇంకా చెల్లించని వారికి వారంలో చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వం జమచేసిన నిధులను గుత్తేదారులకు చెల్లించే విషయంలో సహకరించని సర్పంచులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపి రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. సుమారు 500 వ్యాజ్యాల్లో కేవలం 25 పిటిషనర్లకు మాత్రమే బిల్లులు చెల్లించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లుల చెల్లింపు నిలుపుదల సరికాదని... విజిలెన్స్ విచారణ చేస్తుంటే సంబంధిత పిటిషనర్లకు నోటీసులు ఇవ్వవ్వాలి కదా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంటూ విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్