AP Hates Jagan TDP Book : జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ద్వేషిస్తున్నారంటూ తెలుగుదేశం ఓ పుస్తకం విడుదల చేసింది. దోచుకో, పంచుకో, తినుకో పదాలకు పేటెంట్ జగన్ రెడ్డిదేనని దుయ్యబట్టింది. తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి, చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పటం తన నైజంగా ఉన్న జగన్ రెడ్డే క్రూరమైన పెత్తందారుగా ధ్వజమెత్తింది. తన 52 నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై 8లక్షల 25వేల 549రూపాయల భారం జగన్మోహన్ రెడ్డి మోపాడని పుస్తకంలో తేటతెల్లం చేసింది.
Luxury Buildings in Visakhapatnam for CM Jagan: జనం సొమ్ముతో.. సీఎం జగన్ సోకులు!
ఏపీ హేట్స్ జగన్ పేరిట తెలుగుదేశం పుస్తకం విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నేతలు దీనిని ఆవిష్కరించారు. జగన్ ని క్విట్ చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ 24పేజీల ఈ పుస్తకంలో... లూటీ కోసమే రూ.11లక్షల కోట్ల అప్పు చేశారని దుయ్యబట్టింది. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేయటంతో పాటు 30 వేల మంది ప్రాణాలు పోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడన్న తెలుగుదేశం... మద్యంలో లక్ష కోట్ల రూపాయల కమీషన్ తాడేపల్లి కొట్టేసిందని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారం 64 వేల కోట్లు మోపటంతో పాటు ఉచిత ఇసుక విధానం రద్దుతో 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీసి, 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని పోగొట్టారని విమర్శించింది. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్‌రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని తెలుగుదేశం హెచ్చరించింది. తీరని అన్యాయం రాష్ట్రానికి చేసినందుకే నిన్నిక భరించలేం జగన్ అని రాష్ట్రమంతా ముక్తకంఠంతో నినదిస్తోందని నేతలు మండిపడ్డారు.
జగన్ రెడ్డి దేశంలోనే రిచెస్ట్ సీఎం అని 'ది ప్రింట్ మ్యాగజైన్' పేర్కొనటాన్ని పుస్తకంలో ప్రస్తావించిన తెలుగుదేశం.. భారతీ సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతీ పవర్, సాక్షి మీడియా లాంటి 16 భారీ కంపెనీలతో పాటు మరో 50కు పైగా బినామీ షెల్ కంపెనీలు ఉన్నాయని గుర్తు చేసింది. వేల ఎకరాల భూములతో పాటు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలో ఇంద్ర భవనాలు లాంటి 6 ప్యాలెస్‌లు ఉన్నాయని వివరించింది. 2004 లో రూ.1.73 కోట్ల ఆస్తి కలిగి హైదరాబాద్ లో ఉన్న ఇల్లు సైతం అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి 18 ఏళ్లలోనే 3 లక్షల కోట్లకు నడమంత్రంగా పెరగడం పెత్తందారీతనం కాక మరేంటని ప్రశ్నించింది.
State Government Employees DA: దసరా పండగ వచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా డీఏ రాలేదు..!
కడప ఎంపీ సీటుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన బాబాయిపై గొడ్డలి వేటు వేయించడం, నరహంతకుల్ని కాపాడటం పెత్తందారీతనం కాక మరేమౌతుందని నిలదీసింది. తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన తల్లిని, చెల్లిని తరిమేయడం పెత్తందారీతనం కాదా అని ప్రశ్నించిన తెలుగుదేశం... ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేయించటం, ప్రజావ్యతిరేక విధానాలు, కుంభకోణాలు, ప్రశ్నించిన నేతల ఇళ్లను ధ్వంసం చేయించడం, పార్టీల కార్యాలయాలు ధ్వంసం చేయించడం వంటి ఉదాహరణలు పెత్తందారీతనానివేనని తేల్చి చెప్పింది. పంచాయతీలు, పురపాలక సంఘాలకు చెందిన రూ.12 వేల కోట్ల నిధులు దారిమళ్లింపు, అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించకపోవడం వంటి ఘటనలు పెత్తందారీతనమేనని తెలుగుదేశం స్పష్టం చేసింది. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు, గజదొంగ దేశంలో మరెవరూ లేరని దుయ్యబట్టింది.
చంద్రబాబు పేదల పెన్నిదనటానికి, జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని తెలుగుదేశం వివరించింది. చంద్రన్న బీమాను నీరుగార్చి కోటి 30 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత తొలగించిన పేదల ద్రోహి జగన్ రెడ్డేనని విమర్శించింది. చంద్రబాబు పెట్టిన అన్న క్యాంటీన్లు రద్దుచేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డని దుయ్యబట్టింది. డీజిల్, పెట్రోలు, గ్రీన్ టాక్స్, పోలీస్, ఆర్టీ జరిమానాలు పెంచి మోటార్ రంగ కార్మికుల పొట్టగొట్టారని మండిపడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,664 కోట్లు దారిమళ్లించిన సామాజిక న్యాయ ద్రోహి జగన్ రెడ్డేనని ధ్వజమెత్తింది. 20 వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటంతో పాటు తన బినామీ విద్యుత్ కంపెనీల కోసం 75 వేల ఎకరాలు ఆదివాసీల భూములు కాజేస్తున్న గిరిజన ద్రోహి జగన్ రెడ్డి అని ఆరోపించింది. లక్ష బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోగా చంద్రన్న 6 లక్షలమందికి ఇచ్చిన నిరుద్యోగ భృతి, పండుగ, పెళ్లికానుకలు, విదేశీవిద్య, రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు, స్థానిక సంస్థల్లో 10 శాతం బీసీ రిజర్వేషన్లు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం ఆక్షేపించింది.