రాష్ట్రంలో కొత్త బార్ లైసెన్సుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 838 బార్లకు గానూ స్టార్ హోటళ్లు, మైక్రోబ్రూవరీలు మినహాయించి 40 శాతం తక్కువగా బార్ లైసెన్సుల అనుమతికి ఆదేశాలు వెలువడ్డాయి. 2020 జనవరి 1వ తేదీ నుంచి రెండేళ్ల పాటు ఈ లైసెన్సుల కాలపరిమితి ఉంటుందని సర్కారు నోటిఫికేషన్లో పేర్కొంది. లైసెన్సు ఫీజును రూ.10 లక్షలుగా నిర్దరించిన ప్రభుత్వం.. స్టార్ హోటళ్లకు రూ.1.5 కోట్లు, మైక్రో బ్రూవరీలకు జనాభా ప్రాతిపదికన రూ.75 లక్షల వరకూ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజును ఖరారు చేసింది. బార్ల పనివేళలను కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే పరిమితం చేసేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా
జాతీయ రహదారులు, ధార్మిక, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా బార్లను ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్లో సర్కారు స్పష్టం చేసింది. బార్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసే వివిధ ఫార్మాట్లను... నోటిఫికేషన్‌కు అనుబంధంగా రెవెన్యూ శాఖ జారీ చేసింది. ఒక లైసెన్సు కంటే ఎక్కువ ఉంటే రెండోది రద్దు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక అబ్కారీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ, బెవరేజ్ కార్పొరేషన్లతో నగదు లావాదేవీలకు వీల్లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: