కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలంటూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాయటాన్ని అఖిలపక్షం తప్పుబట్టింది. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఈ అంశంపై అఖిలపక్షాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టాలని డిమాండ్ చేశారు. బోర్డును రాయలసీమ లేదా విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న మొండితనంతోనే.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తరలింపు నిర్ణయం తీసుకున్నారని తప్పుబట్టారు. కృష్ణా యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టాలని చూడటం మరో తుగ్లక్ చర్యని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. విభజన జరిగిన వెంటనే బోర్డు ఏర్పాటు చేయకపోవడం... భాజపా, వైకాపా, తెలుగుదేశం పార్టీల తప్పని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు.
రాయలసీమకు నీటి ప్రాజెక్టుల అవసరం ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి విషయంలో... ఉభయ తెలుగు రాష్టాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలులో ఉన్నందున.. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:
భాజపాది మత విధానం... బండి సంజయ్ కార్పోరేట్ స్థాయి నేత : అంబటి రాంబాబు