ప్రస్తుత డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం ప్రతి ఒక్కరి దినచర్యలో ఓ భాగమైంది. అయితే వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో పొందుపరిచే సమాచారం చోరీకి గురవుతుందంటూ తరచూ వింటూ ఉంటాం. ఈ డేటా చౌర్యాన్ని ఎలా ఆపాలన్న అంశంపై లోతైన పరిశోధన జరిపి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించింది విజయవాడకు చెందిన వైష్ణవి.
ప్రపంచం మెచ్చిన పరిశోధన
ఈ యువతి ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. మొదటి నుంచి సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టిన వైష్ణవి... ఆ దిశగా లోతైన అధ్యయనం చేసింది. రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు బెంగళూరు హ్యాకథాన్‌లో పాల్గొని రెండో స్థానం సంపాదించింది. అనంతరం కాలేజీ ఇంటర్న్‌షిప్ కోసం అమెరికా వెళ్లింది. డెన్వర్‌లో జరిగిన హ్యాకథాన్‌లో పాల్గొని రెండో స్థానం సంపాదించింది. అక్కడే బ్లాక్ చెయిన్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వైష్ణవి తెలుసుకుంది. ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలకు సైబర్ సెక్యూరిటీని పెంచాలని వైష్ణవి నిర్ణయించుకుంది. నాలుగు నెలల పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అధ్యయనం చేసింది. ఆ పరిశోధన వివరాలపై అక్టోబర్ 30న సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనికి గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమెకు చోటు దక్కింది.
యాప్‌తో చౌర్యానికి అడ్డుకట్ట
తాను పరిశోధనలో తెలుసుకున్న అంశాలతో వైష్ణవి 'కాయిన్' పేరిట యాప్‌ను రూపొందించింది. వినియోగదారుడు సామాజిక మాధ్యమ ఖాతాల్లోని ఫొటోలను డిలీట్ చేసినా కంపెనీ సర్వర్‌లో అవి ఉంటాయి. హ్యాకర్స్ ఆ సర్వర్‌ను హ్యాక్ చేసి వాటిని తీసుకునే అవకాశముంటుంది. అయితే తాను తయారు చేసిన కాయిన్ యాప్‌ను చరవాణిలో పొందుపరచుకోవటం ద్వారా వాట్సప్, ఫేస్బుక్ వంటి ఖాతాలను హ్యాకింగ్ చేయటం సాధ్యపడదని వైష్ణవి చెబుతోంది. భవిష్యత్తులో ఎంఎస్ చేసి ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగం సంపాదించటమే తన లక్ష్యమని వైష్ణవి తెలిపారు.
ఇదీ చదవండి
కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్