కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన శ్రీకాకొల్లి ఏలియా మేఘాలయ షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియామకమయ్యారు. పల్లె ప్రాంతంలోని పేద కుటుంబంలో జన్మించి వర్సిటీ వీసీగా ఎదిగారు. నేటి యువతకు, విద్యార్థి లోకానికి ఏలియా ఆదర్శనీయమని పలువురు కీర్తించారు. పల్లెర్ల ముడి గ్రామంలో నిరుపేద కుటుంబం డేవిడ్ అన్నమ్మ దంపతుల కుమారుడు ఏలియా.. చదువుపై ఆసక్తితో తల్లి ప్రోత్సాహంతో డబల్ ఎంఏ సహా బీఈడీ, ఎంఫిఎల్, పీహెచ్డీ పూర్తి చేసి ఎస్డీఏ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు.
మేటాస్ అధ్యక్షుడిగా..
నూజివీడు, రాంచి, సూరత్, జువాయి ప్రాంతాల్లోని పలు పాఠశాలలు, కళాశాలలకు మేటాస్ సంస్థ అధ్యక్షుడిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు సాయం అందించే ఉదారవాదాన్ని పరిగణనలోకి తీసుకున్న మేఘాలయ నార్త్ ఈస్ట్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ.. ఏలియాను వీసీగా నియమించింది. ఈ మేరకు నూజివీడు పట్నం విద్యాసంస్థల సమావేశ మందిరంలో సిబ్బంది ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
అహర్నిశలు కృషి చేస్తాం..
నూజివీడు ప్రాంతంలో ఆస్పత్రి, విద్యాసంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఏలియా వెల్లడించారు. అమెరికన్ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం అమలు అయ్యేలా చూడటమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.