Students were injured in the Bonfire incident: సంక్రాంతి పండగ ముందు స్కూల్ పిల్లలకు పండగ విశిష్టతను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఆ స్కూల్. అయితే, అంతా సజావుగా సాగుతుందనుకునే లోపే భోగి మంటల రూపంలో విద్యార్థులకు గాయాలైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థులను వైద్యచికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఆయా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పండగ ముందు ఇలాంటి ఘటన జరగడంతో ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
పెట్రోల్ పోయడంతో: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో అపశృతి చోటు చేసుకుంది . భోగిమంట వెలిగిస్తున్న సమయంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగింది. స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగిమంట వేశారు.. ఇంతలోనే మంటల్లో పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో భోగిమంట వద్ద నిల్చొన్న విద్యార్థులపై.. నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఒకటో తరగతి చదువుతున్న స్టీఫెన్ పాల్, మూడో తరగతి చదువుతున్న వనిత, కీర్తన అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు: పాఠశాల యాజమాన్యం వెంటనే వీరిని అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంటల్లో గాయపడిన విద్యార్థులను మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆసుపత్రి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. పండగ ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
'గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు భోగిమంటల వల్ల గాయాలయ్యాయి. వెంటనే అధికారులను అప్రమత్తం చేశాం. మెరుగైన చికిత్స కోసం వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. అందుబాటులో ఉన్న పిల్లల వైద్య నిపుణులతో సంప్రదించి తగిన వైద్యం చేయాలని ఆదేశించాం. ప్రతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అనవాయితీ. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తారు. ఇందులో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినట్లైతే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.'- పినిపే విశ్వరూప్,మంత్రి