Flood effect: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగు వాణిలంక వద్ద గోదావరిలో నిన్న సాయంత్రం గల్లంతైన బడుగు యేసు శవమై తేలాడు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యమైంది. చెముడు లంక పీహెచ్సీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
గోదావరి వరద ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన కడలి శ్రీను ఈనెల 16న తన ఇంటి సమీపంలో గల్లంతయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ అనే మత్స్యకారుడు.. ప్రభుత్వం పురమాయించిన ప్రకారం పడవలో వరద బాధితులను చేరవేస్తూ.. నిన్న తన ఇంటి సమీపంలో వైనతేయ గోదావరిలో గల్లంతయ్యాడు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రామకృష్ణకు భార్య ఇద్దరు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉండగా.. శ్రీనుకు భార్య ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ.. ఆయా కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చూడండి