గోదావరి జిల్లాల రైతులు మూడేళ్లుగా ముంపు బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్లు నిండిపోయి పొలాలు నీట మునుగుతున్నాయి. పైగా సముద్రపునీరు చొచ్చుకొస్తోంది. పొలాల్లో 15 నుంచి 20 రోజులపాటు ఉప్పునీరు నిలుస్తుండటంతో పైరు కుళ్లిపోతోంది. ఇంకోసారి నాట్లు వేసినా నెలకో, రెండు నెల్లకో మళ్లీ ముంపు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికల ప్రకారమే... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2020 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 2 లక్షల 15వందల 40 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. దీనివల్ల 530.69 కోట్ల నష్టం జరిగింది. గతేడాది నవంబర్ వరకు 1.55 లక్షల ఎకరాల్లో 400 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. సమస్య ఇంత తీవ్రంగా ఉండటంతోనే... కౌలు రైతులు, రైతులు చేతులెత్తేస్తున్నారు. ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాట్రేనికోట, కడియం మండలాల్లో ఈటీవీ- ‘ఈనాడు బృందానికి డ్రెయిన్ల దుస్థితిని రైతులు వివరించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తూర్పు, మధ్య డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచి కెనాల్ కలిపి... 36 మండలాల పరిధిలో గోదావరి ఆనకట్ట కింద 4.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 431 కిలోమీటర్ల విస్తీర్ణంలో పంట కాలువలు ఉన్నాయి. వర్షం కురిసిన గంటల్లో, లేదంటే ఒక్క రోజులోనే పొలాల నుంచి వరదంతా బయటకు వెళ్లేలా రెవెన్యూ బోదెలు, వాటికి అనుసంధానిస్తూ మైనర్, మీడియం, మేజర్ డ్రెయిన్లు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా వరదనీరు గోదావరి నది, సముద్రంలోకి కలుస్తుంది. ఇలాంటి చక్కటి వ్యవస్థ నిర్వహణను గాలికొదిలేశారు.
డ్రెయిన్లలో దశాబ్దాలుగా పూడికతీత సరిగా జరగడం లేదు. గేట్ల మరమ్మతులు లేవు. చాలాచోట్ల ఆక్రమణలు, వంతెల నిర్మాణంతో ప్రవాహ మార్గాలు మూత పడుతున్నాయి. సముద్రంలోకి వరదనీరు ప్రవేశించే మార్గాలు మూసుకుపోయి... డ్రెయిన్ల ద్వారా ఉప్పునీరు వెనక్కి వస్తోంది. ఇది పొలాలను ముంచెత్తుతోంది. కాల్వలకు జూన్ 1న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. అయితే డ్రెయిన్ల మరమ్మతు చేయకుండా నీరిచ్చి ఉపయోగమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 4 వేలకు పైగా ఆక్రమణలను గుర్తించినా... ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. డ్రెయిన్ల మరమ్మతులకు 10.98 కోట్లతో ప్రతిపాదనలు పంపితే 3.96 కోట్లు మంజూరు చేశారు.
'ఉపాధి హామీ పథకం కింద ఎక్కడికక్కడ పనులు చేస్తున్నావాటితో ప్రయోజనం ఉండటం లేదు. పూడికతీతను వదిలేసి, పైపైన గడ్డి మాత్రమే కోస్తుండటంతో నీరు ముందుకు పారే పరిస్థితి లేదు. ఎక్కడ ఎంత పూడిక ఉంది? ఎంత లోతులో తవ్వాలో జలవనరులశాఖ అంచనాలు వేస్తే.. ఆ మేరకు పంచాయతీరాజ్ ద్వారా పనులు చేయొచ్చు. అయినా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రెయిన్లు, పంటకాల్వలు, రెవెన్యూబోదెల మరమ్మతులపై దృష్టి సారిస్తే ముంపు తప్పుతుంది' అని రైతులు కోరుతున్నారు.