EC Orders To Collector on Rapaka Comments: తను ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లే కారణమని రాజోలు ఎమ్మెల్యే మార్చిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార, ప్రతిపక్ష నేతలు కామెంట్లు విసురుకున్నారు. అయితే తాను చెప్పింది ఎప్పుడో జరిగిన ఎన్నికల సంగతి అని రాపాక వివరణ ఇచ్చిన దానిపై ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగలేదు. తాజాగా రాపాక ఎన్నికపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఎన్నికపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాపాక ఎన్నికపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 24వ తేదీన అంతర్వేదిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పలు వ్యాఖ్యలు చేశారు. పూర్వం నుంచి తమ స్వగ్రామం చింతలమోరికి ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చే వారని.. ఒక్కొక్కరు 5 నుంచి 10 దొంగ ఓట్లు వేసేవారని.. ఆ ఓట్లే తమ గెలుపునకు దోహదపడేవని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లోను తెగ వైరల్ అయ్యాయి. దీనిపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంకు చెందిన NRI యనుమల వెంకటపతి రాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో రాపాక వరప్రసాద రావు ఎన్నికపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాపాక పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యాలంటూ టీడీపీ తనను సంప్రదించి 10కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిందని అని ఆరోపించారు. ఆ తర్వాత నేను అలా అనలేదని.. టీడీపీకి ఓటు వేస్తే పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చేదని మాత్రమే అన్నారని రాపాక తెలిపారు.
ఇవీ చదవండి: