Nara Lokesh Yuvagalam Padayatra in Razole Constituency: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించారు. చించినాడ గోదావరి వంతెన మీదుగా.. డిండి చేరుకున్న లోకేశ్‌కు.. స్థానికులు భారీ కొబ్బరికాయల దండతో ఘనస్వాగతం పలికారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని కులవృత్తులవారూ ఇబ్బందులు పడుతున్నారని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చామని అలాగే వివిధ రాకాల సబ్సీడీలు అందించి ఆదుకున్నామని గుర్తు చేశారు. జగన్ పాలనలో కార్పొరేషన్‌లకే నిధులు లేవని.. ఇంక కులవృత్తులవారిని ఎలా ఆదుకుంటారని మండిపడ్డారు.
యువగళం పాదయాత్రలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గ శెట్టిబలిజ నేతలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. శెట్టిబలిజలకు అడుగడుగునా అండగా ఉంటామన్న నారా లోకేశ్.. స్థిరాస్తి వ్యాపారం పెరగడం వల్ల తాటిచెట్లు తగ్గిపోతున్నాయన్నారు. వచ్చే ఏడాది టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఖాళీ స్థలాల్లో తాటిచెట్లు పెంచుతామని లోకేశ్ తెలిపారు. అదే విధంగా శివకోటిలో రైతులతో లోకేశ్ సమావేశమయ్యారు.
సీఎం జగన్ 43 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారని లోకేశ్ విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం జగన్.. పెత్తందారు కాక మరేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పేదలు దుర్భర జీవితం గడుపుతుంటే.. జగన్ లండన్ ఖర్చు రూ.43 కోట్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలేమో రోడ్లపైన బురద గుంటల్లో పడుతూ లేస్తూ వెళ్లాలా అని ధ్వజమెత్తారు. 208వ రోజు కొనసాగిన యువగళం పాదయాత్ర.. ఉమ్మడి తూ.గో. జిల్లాలోకి ప్రవేశించి.. సాయంత్రానికి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి చేరుకుంది. రాజోలులో స్థానికులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు.
"కష్టాన్ని నమ్ముకున్న వారు శెట్టిబలిజ సోదరులు. చేయి చాచకుండా సొంత కాళ్లమీద నిలబడతారు. డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే దానం చేసే వారు శెట్టిబలిజ సోదరులు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నేడు ఏమీ చేయలేదు. కార్పొరేషన్లకు నిధులు లేవు. కనీసం ఆదుకునే వారు కూడా లేరు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గత నాలుగేళ్లలలో శెట్టిబలిజ సోదరులకు ఒక్కరికి అయినా లోన్ వచ్చిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు 26 వేల మంది బీసీలపై ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది". - నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి