ప్రజాస్వామ్యంలో జిల్లాల పేర్లు మార్చడం నిరంతర ప్రక్రియని... ఇంకో ఆర్నెల్లు పోతే మరో జిల్లా పేరు మార్చొచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు మిగతా కొత్త జిల్లాల కంటే ఆలస్యంగా పేరు మార్చడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించినప్పుడు మంత్రి పై విధంగా స్పందించారు.
‘అమలాపురంలో మంగళవారం నాటి ఘటనకు తెదేపా, జనసేన పార్టీలే కారణం. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలి. ఇందుకు బాధ్యులైన వారెవరినీ విడిచిపెట్టేది లేదు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అమలాపురంలో కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారా? పోలీసులు సంయమనం పాటించి ప్రాణనష్టం లేకుండా చూశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేడ్కర్ ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదు. అమలాపురం ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సామాజిక న్యాయభేరి’ కార్యక్రమం తలపెడితే, దానికి రెండు రోజుల ముందు అమలాపురం ఘటన చోటుచేసుకోవడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన ‘సామాజిక న్యాయ భేరి- జయహో జగనన్న’ ఆడియో, వీడియోను ప్రారంభించారు.
ఇదీ చదవండి: Suspended: వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్