Konaseema Villages Struggle over Godavari Floods for Food : కోనసీమ తీరాన్ని అతలాకుతలం చేసిన గోదారమ్మ క్రమంగా శాంతిస్తున్నా గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలు ఉద్ధృతంగానే ప్రవహిస్తున్నాయి. వరద పోటుతో లంక గ్రామాలు వారం రోజులుగా నీటిలోనే మగ్గుతున్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరదలో నానుతున్నాయి. రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతూనే ఉంది. నిత్యావసరాల కోసం జనం పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్జీవో కాలనీ, కొత్తపేట, పల్లిపాలం, రకజపేట కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇళ్లను వరద ముంచేయడంతో తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. శివారు లంకలదీ అదే దుస్థితి.
పాలు లేక ఏడుస్తున్న చంటి బిడ్డ : నిత్యావసరాలు సహా బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రకటించినా, వాస్తవానికి అలాంటి పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. భోజనం అందలేదంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో మహిళలు రోడ్డెక్కారు. పాలు కూడా లేక చంటి బిడ్డలు అల్లాడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. కేవలం డబ్బా మంచి నీళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని వారు వాపోయారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరింత కుంగతీస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు : పి.గన్నవరం మండంలం పరిధిలోని నాగుల్లంకను వరద ముంచేసింది. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. కె.ఏనుగుపల్లిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పడవల్లోనే ఒడ్డుకు చేరుతున్నారు. వరదలు వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి వస్తోందని, వంతెన కట్టి శాశ్వత పరిష్కారం చూపాలని లంకవాసులు కోరుతున్నారు. పశుగ్రాసం, దాణా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పంట పొలాలను సైతం గోదారి ముంచెత్తింది. వరి నాట్లు వేసిన పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. కూరగాయలు, అరటి, బొప్పాయి, ఇతర వాణిజ్య పంటలు వరద నీటిలో నాని కుల్లిపోతున్నాయి. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బాధితులకు భరోసా : కోనసీమ వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 30 గ్రామాలకు చెందిన 3 వేల 46 మంది నిరాశ్రయులయ్యారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. 11వందల 41 హెక్టర్లలో పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించారు. శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 4 పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించామని కొత్తపేట ఆర్డీవో ముక్కంటి తెలిపారు.
"మా ఇళ్లు అన్ని మునిగిపోయాయి. వారం రోజుల నుంచి మాకు నీళ్లతోనే కడుపు నిండుతుందా? పాల ప్యాకెట్లు లేవు. చంటి పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు. కనీసం కాయగూరలు ఇస్తే వండుకొని తింటాం. రైతులం చాలా నష్టపోయాం. మేమంతా చాలా బాధ పడుతున్నాం."- బాధితులు