Pawan Kalyan Serious Allegations: రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే.. వైసీపీని తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమలాపురం బహిరంగ సభలో పిలుపునిచ్చారు. 'హలో ఏపీ.. బై బై వైసీపీ' అంటూ కొత్త నినాదం ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. పవన్ కల్యాణ్‌ను చూడటానికి జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు పోటెత్తారు. జనసందోహం, పోటెత్తిన అభిమానుల మధ్య రోడ్ షో సాగింది. రోడ్ షో అనంతరం అమలాపురంలో గడియారం స్తంభం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారని... అయితే, అభిప్రాయ సేకరణ పేరుతో వైసీపీ నేతలే గొడవలు సృష్టించారని ఆరోపించారు. అనంతరం జరిగిన గొడవల్లో 250 మందిని జైలులో పెట్టారని పేర్కొన్న పవన్.. జైలులో పెట్టిన అమాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు ఇంత గొడవ జరగాలా అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గొడవలను పెంచేవారు నాయకులు కాదన్న పవన్ కల్యాణ్ గొడవలను తగ్గించే వారే నిజమైన నాయకులని పేర్కొన్నారు.
గంజాయికి గేట్‌వేగా కాకినాడ: వైసీపీ ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. గంజాయికి గేట్‌వేగా కాకినాడ మారిందని ఆరోపించాడు. వైసీపీ పాలనలో ఏపీలో నేరాలు పెరిగాయని పవన్ విమర్శించారు. ప్రభుత్వ అండతో దేశమంతా గంజాయి అమ్ముతున్నారన్న పవన్.. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై అమిత్‌షాకు చెప్పినట్లు పవన్. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని పవన్ విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.25 వేల కోట్లు సంపాదిస్తున్నారని ఎద్దేవా చేశాడు. కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల పసుపు కుంకుమలతో ఆటలాడుకుంటున్నారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. సంపూర్ణంగా మద్యం అమ్ముతున్నారని పవన్ ఆరోపించారు.
జనసేన గళం ఎత్తితేనే రైతుల ఖాతాల్లో డబ్బులు: వైసీపీకి ఓట్లు వేసిన రైతులు.. ఇప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ధాన్యం పండించే రైతు నష్టాల్లో కూరుకుపోతున్నారన్న పవన్.. జనసేన గళం ఎత్తితేనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని వెల్లడించారు. అధికారంలోకి వస్తే రైతుభరోసా కేంద్రాలను రైతుకు భద్రత కల్పించే కేంద్రాలుగా మారుస్తామని వెల్లడించారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికారపక్షానికి అడ్డూఅదుపు ఉండదని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జనసేన పక్షాన నిలబడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సారి ఓటు వేసేటప్పుడు పోరాటం చేసే వ్యక్తులు కావాలని ఆలోచించి వేయాలని ప్రజలకు సూచించారు.
ఎస్‌ఐ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. 2 లక్షల ఉద్యోగాల కల్పన పేరుతో జగన్ యువతకు మొండి చేయి చూపారని ఆరోపించాడు. జగన్ ను నమ్మి ఒక్క అవకాశం ఇస్తే జాబ్ క్యాలెండర్ రాకుండా చేశారని జగన్‌పై మండిపడ్డారు. ఎస్‌ఐ పోస్టులు, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్య, వైద్యం భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమే చూసుకోవాలన్న పవన్.. జనసేన అధికారంలోకి వస్తే విద్య, ఉపాధిపై ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని పవన్ పేర్కొన్నారు. జనసేనకు పార్లమెంటులో బలమైన సత్తా ఇవ్వాలని ప్రజలను కోరారు.