Pidakala Danda : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిసంవత్సరం ఈ బోగిదండను తయారు చేస్తుంటారు. గతంలో వీరు తయారు చేసిన పిడకల దండలకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు కూడ వచ్చింది. అయితే ఈ సంవత్సరం కూడా కిలోమీటరు పోడవైన భోగి దండను తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ దండను తయారు చేయటానికి వారు.. చింతలూరులో ఉన్న గోశాల, గ్రామంలోని పాడి రైతుల నుంచి ఆరు టన్నుల వరకు, ఆవు పేడను సేకరించి వినియోగించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని మహిళ భోగి దండ తయారిలో భాగమయ్యారు.
ఈ భోగి దండను తయారు చేయటానికి గ్రామంలోని మహిళలు ముందుగా ఆవు పేడ సేకరించుకున్న తర్వాత.. పిడకలను తయారు చేస్తామని తెలిపారు. పిడకలు ఆరిన తర్వాత దారం సహాయంతో ఒక దండలాగా తయారు చేస్తామన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఈ భోగి పిడకల దండ తయారీలో నిమగ్నమైనట్లు వారు పేర్కోన్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయలను మరిచిపోకుండా ఉండేందుకే ఇలా తయారు చేశామని గుమ్మిలేరు మహిళలు అంటున్నారు.
"మరిచిపోయిన మన పురాతన సంప్రదాయలను గుర్తు చేయటానికి, తెలియని వారికి తెలియచెప్పటానికి ఈ భోగి దండను తయారు చేశాము. అసలు పండగ ఎలా చేసుకుంటారు. పండగ అంటే ఎంటి తెలియకుండా పోతొంది.. నేటి తరానికి అందుకోసమే ఈ పిడకల దండను తయారు చేశాము." - గుమ్మిలేరు గ్రామస్థురాలు
ఇవీ చదవండి: