Government School Problems : ప్రభుత్వ నిర్లక్య వైఖరి వల్ల ప్రభుత్వ పాఠశాలలు అవస్థలు పడుతున్నాయి. కొన్ని పాఠశాలలకు నాడు నేడు కింద నిధులను వెంటనే విడుదల చేయకపోవటం.. మూడు, నాలుగైదు తరగతులను ఉన్నత పాఠశాల్లో విలీనం చేయటం లాంటి కారణాల వల్ల అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విలీనం కారణంగా కొన్ని పాఠశాల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో పాఠశాలలను నడపాల్సి వస్తోంది. నిధుల కొరత కారణంగా చిన్నపాటి షెల్టర్లో పాఠశాలను నిర్వహిస్తున్నారు. వీటికి నిదర్శనంగా కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజక వర్గంలోని పాఠశాలలు నిలుస్తున్నాయి.
పాఠశాలగా మారిన అంబేద్కర్ విగ్రహం షెల్టర్ : నియోజకవర్గంలోని లంకల గన్నవరం నడిగాడి ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నాడు నేడు పనుల పేరుతో తొలగించారు. నూతన భవనం నిర్మాణం కోసం నాడు నేడు రెండో దశ కింద ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.53 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇంతవరకు మొత్తం 13 లక్షల 50 వేల రూపాయలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన నిధులతో భవనం, వంటగది, మరుగుదొడ్ల స్లాబులు వేశారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. త్వరగా భవన నిర్మాణ పనులు జరగాలంటే నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
"ప్రస్తుతం పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 45 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహం షెల్టర్లో పాఠశాలను నిర్వహిస్తున్నాం. ఆ చిన్నపాటి షెల్టర్లో పాఠశాలను నడపటం చాలా కష్టంగా ఉంటుంది. వానలకు తడిసి, చలికి వణుకుతూ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నాడు నేడు కింద నిధులను విడుదల చేస్తే.. అంతే త్వరగా నూతన భవన నిర్మాణం పూర్తి చేయించి మరింత ఉత్సాహంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం." - బిళ్ల దుర్గారావు, ప్రధానోపాధ్యాయుడు
ఒకరిద్దితో నడుస్తున్న పాఠశాలలు : గన్నవరం నియోజక వర్గంలోనే బెల్లంపూడిలోని అరుంధతి పేట, ఎల్లమెల్లి వారి పేట, కారుపల్లిపాడు పాఠశాలల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పాఠశాల్లో ఇద్దరు,ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మూడు, నాలుగైదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థతి ఏర్పడింది. కారుపల్లిపాడు పాఠశాలలో ఇద్దరు, ఎల్లమెల్లి వారి పేట పాఠశాలలో ఒకరు, అరుంధతి పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. గతేడాది వరకు విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు... ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా నేడు నామమాత్రపు విద్యార్థులతో కళావిహీనంగా తయారయ్యాయి.
CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన