Floods in konaseema: గోదావరి నదికి మళ్లీ వరదనీరు పోటెత్తింది. కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి నదిపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్, కాటన్ అక్విడెక్ట్ల మధ్య వైనతేయ గోదావరి జోరుగా ప్రవహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా అనగారిలంక, పుచ్చలంక, అయోధ్య లంక, గ్రామాలతోపాటుగా.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అరిగెల వారి పేట, జి పెదపూడి లంక, ఊడిముడి లంక, బూరుగులంక గ్రామాల ప్రజలు మరపడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
కనకాయలంకలో మునిగిన కాజ్వే: గోదావరి నదికి మళ్ళీ వరద పోటెత్తడంతో ధవలేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న కోనసీమ ప్రాంతంలోని చాకలి పాలెం సమీపంలో గల పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కు చెందిన కాజ్వే ముంపు బారిన పడింది. ఈ వరదల సీజన్లో ఈ కాజ్వే ఇలా వరద ముంపు బారిన పడడం ఇది నాలుగవసారి. కనకాయలంక గ్రామ ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం వైపు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కాజ్వే ఎత్తుగా నిర్మించాలని లంక గ్రామ ప్రజలు అనేక సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికి ఫలితం ఉండటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వరదకే ఈ కాజ్వే ముంపు బారిన పడుతుందని పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన కాజ్వే నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: