Amalapuram incident: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మే 24వ తేదీన జరిగిన విధ్వంసకర సంఘటనలో ఇప్పటివరకు నాలుగు దఫాలుగా మొత్తం 71 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మంది అనుమానితుల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు ఎస్పీలు సిద్ధార్థ కౌశల్, రవీంద్రనాథ్ బాబు క్షేత్రస్థాయిలో అమలాపురంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
నిందితుల కోసం 7 బృందాల వేట: గత నెల 24న జరిగిన విధ్వంసంలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాలు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసం, మూడు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. అమలాపురంలోని శుభకలశం మొదలుకొని గడియార స్తంభం నల్ల వంతెన, కలెక్టరేట్ ఎర్ర వంతెన, మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాస దగ్ధం వరకు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు.. సాంకేతిక సహకారంతో దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 7 బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
అందుబాటులోకి రాని ఇంటర్ నెట్ సేవలు: పస్తుతం అమలాపురం పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు.. తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. పట్టణంలోకి వస్తున్న వారికి అన్ని రకాల ప్రశ్నలు అడిగి.. సంతృప్తి చెందితే అమలాపురంలోకి అనుమతిస్తున్నారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో నిలిచిన ఇంటర్‌నెట్ సేవలను ఎప్పటికీ పునరుద్ధరిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తొలుత సకినేటిపల్లి, మల్కిపురం మండలాల్లో ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నా.. నేటికి అందుబాటులోకి రాలేదు. ఇంటర్ నెట్ సేవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. త్వరగా సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కోనసీమ జిల్లాలో రేపు ఉదయంలోగా ఇంటర్‌నెట్ సేవల పునరుద్ధరణ