Gadapa Gadapaku: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా నేతలకు నిరసనల పర్వం కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని పింఛన్ ఇవ్వాలంటూ ఓ పెద్దాయన నిలదీశారు. నిబంధనల ప్రకారం ఆయనకు పింఛను రాదని చెప్పినా.. సాయం చేయాలని సదరు వ్యక్తి పదేపదే కోరడంతో ఎమ్మెల్యే అసహనానికి లోనయ్యారు. పైగా చుట్టలు కాల్చేందుకు వెచ్చించే సొమ్ము మిగుల్చుకుంటే పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదంటూ ఉచిత సలహా ఇచ్చారు. తనకు ఆధారం లేదని, ఎలాగైనా పింఛన్ ఇవ్వాలంటూ కోరిన వ్యక్తిపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి పుష్పశ్రీవాణిని ప్రజలు నిలదీశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొరిశిల, శిఖవరంలో ఆమె పర్యటించగా.. మూడేళ్లలో ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రజలు నిలదీశారు. పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించామని, త్వరలో వంతెన పూర్తవుతుందని చెప్పినా ప్రజలు ఆగలేదు. తీవ్ర అసహనానికి గురైన పుష్పశ్రీవాణి.. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విజయనగరం జిల్లా కొత్తవలసలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావును మూడు ప్రాంతాల్లో ప్రజలు నిలదీశారు. రాజీవ్ నగర్‌లో మురుగునీటి పారుదల, రహదారులు, తాగునీటి సమస్యలను మహిళలు ఏకరువు పెట్టారు. ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని వాపోయారు. కుళాయి నీటికి ఇబ్బంది పడుతున్నామని వివరించారు. తన తండ్రికి చెందిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా ఎమ్మెల్యే సోదరుడు అడ్డుకుంటున్నారని.. ఇదే ప్రాంతానికి చెందిన వైకాపా కార్యకర్త భవానీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ లేఖలు చూసి.. ఆశ్చర్యపోతున్న సామాన్యులు : కుటుంబాల వారీగా ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని ప్రస్తావిస్తూ ఇస్తున్న లేఖలు చూసి.. సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. తాము ఎలాంటి లబ్ధి పొందకపోయినా.. ఆయా పథకాల కింద ఇంతమొత్తం ఇచ్చామంటూ ఎమ్మెల్యేలు అందిస్తున్న లేఖలు చూసి అవాక్కవుతున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురువారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో భాగంగా బాపట్ల పట్టణంలోని ఉమ్మారెడ్డి సరోజినీదేవి కాలనీలో పర్యటించారు. తోట మంగమ్మ అనే మహిళ ప్రభుత్వం నుంచి మూడేళ్లలో రూ.58,330 సాయం పొందినట్లు సీఎం వైఎస్ జగన్ పేరుతో లేఖ అందించారు. రైతు భరోసా కింద రూ.27 వేలు, జగనన్న విద్యా దీవెనగా రూ.17,500, వైఎస్సార్ ఆసరా కింద రూ.10,262 సాయం చేసినట్లు ఉంది. ‘సెంటు భూమి లేని నాకు రైతుభరోసా డబ్బులివ్వడమేంటి? మా పిల్లలిద్దరి చదువులు ఐదేళ్ల క్రితమే అయిపోతే ఇప్పుడు విద్యాదీవెన ఎలా ఇస్తారు? ఆసరా సాయం పొందేందుకు అర్హత లేకున్నా తీసుకున్నట్లు ఎలా చూపారు? రూపాయి లబ్ధి లేకుండానే ఇచ్చినట్లు లేఖ పంపుతారా’ అంటూ మంగమ్మ వాపోయారు.
అనంతపురంలోని మొదటి రోడ్డులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ‘సంక్షేమ బావుటా’ పేరుతో ముద్రించిన బుక్‌లెట్లు పంచారు. జీరోక్రాస్‌లో నివసిస్తున్న మెరుసు చిరంజీవికి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.37,300 అందజేసినట్లు ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. ఇదే కుటుంబంలోని ఓబుళనాయుడు రూ.20 వేలు పొందినట్లు పేర్కొన్నారు. తమకు ఎలాంటి లబ్ధి సమకూరలేదని చిరంజీవి ఎమ్మెల్యే ఎదుట వాపోయారు.
ఇదీ చదవండి: