Woman Sarpanch Angry On YSRCP Leaders : కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామ సచివాలయంలో గ్రామానికి చెందిన కొంత మంది వైఎస్సార్సీపీ నేతలు సచివాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వడిచెట్టి గౌరీ రాజేశ్వరి సచివాలయానికి చేరుకున్నారు. వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా సచివాలయం నుంచి బయటికి వెళ్లకపోతే కాలర్లు పట్టి గెంటెయవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. దీంతో వారు సచివాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు.
కక్ష తీర్చుకుంటున్న ఎమ్మెల్యే దొరబాబు వర్గం : ఎవరి అనుమతితో సచివాలయంలో సమావేశం పెట్టారని నిలదీసినందుకు, మహిళ అని కూడా చూడకుండా తనను అవమానించారని సర్పంచ్ వడిచెట్టి గౌరీ రాజేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్సీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అయినా తనపై నియోజవర్గ ప్రజా ప్రతినిధులు వ్యతిరేఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో నిజాయతీగా ఉంటూ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గెలుపు కోసం కృషి చేసిన తమపై ఎమ్మెల్యే వర్గం కక్ష తీర్చుకుంటున్నారని, సర్పంచ్‌కి కనీస గౌరవం ఇవ్వటం లేదని గౌరీ రాజేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు.
సర్పంచ్ వడిచెట్టి గౌరీ రాజేశ్వరి భర్త నారాయణ రెడ్డి వివరణ: వైఎస్సార్సీపీ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశామని సర్పంచ్ భర్త వరిసెట్టి వడిచెట్టి నారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొరబాబు గెలుపుకి కృషి చేశామని, సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య గౌరీ రాజేశ్వరిని ఏకగ్రీవంగా గెలిచిందని అన్నారు. గ్రామంలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు పార్టీ నుంచి దూరంగా పెట్టారని అన్నారు. గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుని పార్టీ బాధ్యతలు అప్పగించారని, అంతటితో ఆగకుండా సర్పంచ్ గౌరీ రాజేశ్వరి బాధ్యతలను నిర్వహించకుండా అడ్డంకులు పెట్టారని తెలిపారు. సచివాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ సమావేశం సచివాలయంలో నిర్వహించి నిబంధనలను ఉల్లంగించారని అన్నారు.
" సర్పంచ్ అయిన నాకు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వటం లేదు. మాపై దౌర్జన్యం చేస్తున్నారు. జగనన్న పరిపాలనలో ఇటువంటి అవమానాలు మా మీద జరుగుతున్నాయి. మహిళా సర్పంచ్ అయిన నాతో అగౌరవంగా వైఎస్సార్పీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. " - వడిచెట్టి గౌరీ రాజేశ్వరి, నాగులపల్లి సర్పంచ్
ఇవీ చదవండి