CID POLICE: కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన 'ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కేసులో సీఐడీ పురోగతి సాధించింది. ఈ ఆర్ధిక నేరం కేసులో ఏ-1గా ఉన్న సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, ఏ-2గా ఉన్న వైస్ చైర్మన్ రాయవరపు బదరీ విశాలాక్షిలతో పాటు కేసులో ఏ-4 రాయవరపు జయదేవమణిని సీఐడీ బృందం అరెస్టు చేసింది.
జయదేవమణిని శనివారం కాకినాడలోని రెండో అదనపు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జయదేవమణికు రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమైన సీతారామాంజనేయులు, బదరీ విశాలాక్షిలను సీఐడీ బృందం నేడు జ్యుడిషయల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.
కాకినాడలోని సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్ సొసైటీ కాకినాడ, కోనసీమ, తూగో, పగో, విశాఖ, కృష్ణ జిల్లాల్లో 29 బ్రాంచీలు నడుపుతోంది. 59205 మంది ఖాతాదారులు.. 19వేల మంది పొదుపుదారులున్నారు. రూ. 582 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించిన సొసైటీ యాజమాన్యం రుణాల మంజూరులో నిబంధనలు అతిక్రమించి సొంత అవసరాల కోసం రుణాలు వాడుకున్నారు. అనంతరం అతిక్రమణలతో సంస్థను సంక్షోభంలోకి నెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ ఏడాది ఏప్రిల్లో వ్యవహారం వెలుగులోకి రావడంతో బాధితులు ఆందోళనలకు గురై రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్/ రిజిస్ట్రార్ సొసైటీ అక్రమాలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించారు. మరోవైపు కాకినాడ జిల్లా పోలీసులు పలువురు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమార్కులు, రాజకీయ దన్నుతో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. విలువైన ఆస్తులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలకమైన ముగ్గురు నిందితులిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు..ఇతర పాత్రదారులు కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: