Assassination Attempt On TDP Leader in Tuni: కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కలకలం రేపింది. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటి వద్దకు స్వామిమాల వేసుకుని వచ్చిన దుండగుడు.. బిక్ష తీసుకుంటున్నట్లు నటించి శేషగిరిరావుపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శేషగిరిరావుపై దాడిని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. అన్యాయాలను నిలదీసే గళాన్ని అణిచివేసే కుట్రని ధ్వజమెత్తారు.
కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం నేత పొల్నాటి శేషగిరిరావుపై పట్టపగలే హత్యాయత్నం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో... శేషగిరిరావు ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి స్వామిమాల వేసుకుని వచ్చారు. శేషగిరిరావు బియ్యం వేస్తుండగా ఒక్కసారిగా కత్తి కట్టాడు. తలపై నరికేందుకు యత్నించగా శేషగిరిరావు తప్పిచుకున్నారు. మరోసారి చేతిపై దాడిచేసిన దుండగుడు బైక్‌పై పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావును తెలుగుదేశం నేతలు యనమల, చినరాజప్ప పరామర్శించారు. వైకాపా ఆగడాలకు తుని జనం భయభ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చంపేందుకూ వెనుకాడట్లేదని ధ్వజమెత్తారు. శేషగిరిరావుపై.... ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. హత్యాయత్నంపై జగన్ బాధ్యత వహించాలన్నారు.
జగన్ గొడ్డలి పోటును.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైకాపా ఆగడాలను నిలదీసే తెలుగుదేశం నేతల గళాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించినందుకే శేషగిరిరావును చంపేందుకు యత్నించారని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
శేషగిరిరావు ఫిర్యాదు మేరకు తుని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని.. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. శేషగిరిపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
విశాఖ దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు..
అబ్బబ్బ ఏమి అందాలు టూ మచ్ హాట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్నారుగా