Kirlampudi PACS Fraud: బినామీ రుణాలతో కోట్ల రూపాయలు దారి మళ్లించిన వ్యవహారం కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో వెలుగులోకి వచ్చింది. రాజకీయ దన్ను చూసుకొని ఉద్యోగులు, పాలక వర్గాలు కుమ్మక్కయి రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2012 నుంచి 2022 మధ్య కాలంలో 85 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్టు సమాచారం.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-PACS పరిధిలో 2012 నుంచి 2022 మధ్య కాలంలో 85 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్టు స్పష్టం అవుతోంది. సరైన పత్రాలు, సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేశారని.. ప్రాథమికంగా ఇవన్నీ బినామీ రుణాలే అని తేల్చారు. 85 లక్షల రూపాయల నిధులు సైతం గల్లంతు అయినట్లు గుర్తించారు.
కాకినాడలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాయంతో నడిచే కిర్లంపూడి పీఏసీఎస్ సొసైటీ పరిధిలో కోలంక, సింహాద్రిపురం, కిర్లంపూడి, సిరిపురం, తదితర గ్రామాల పరిధిలోని 10 వేల 500 మంది రైతులు ఉన్నారు. ఏడాదికి సుమారు 125 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. 2006లో అప్పటి ప్రభుత్వ నిర్ణయంతో 150 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మాఫీ అయ్యాయి. ఆ తర్వాత పునరుద్ధరించిన రుణాలు కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిలో సరైన పత్రాలు లేకుండా రుణాలు పొందటం వెనక కొందరు నాయకులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సొసైటీ రుణాల్లో వసూలు చేసిన కొంత మొత్తం కూడా నగదు పుస్తకాల్లో నమోదు చేయలేదు అనే చర్చ నడుస్తోంది.
కిర్లంపూడి పీఏసీఎస్‌లో 85 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ప్రత్తిపాడు బ్రాంచ్ సూపర్ వైజర్ కొండబాబు తనిఖీల్లో గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కాకినాడ డీసీసీబీ సీఈవో నరసింహారావుకు సమర్పించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు సీఈవో విన్నవించారు.
అవకతవకలు జరిగిన కాలంలో సీఈవోగా వ్యవహరించిన కట్టా రాజబాబు ఈ నెల 23న మరణించారు. ఆయనతోపాటు ఆ సమయంలో పని చేసిన మరికొందరు ఉద్యోగులు సైతం పదవీ విరమణ పొందారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులకు నగదు, రుణాల మంజూరు వ్యవహారాల్లో అనుమానాలు రావడంతో వ్యవహారం రచ్చకెక్కినట్టు తెలుస్తోంది. కిర్లంపూడి పీఏసీఎస్‌లో 2012-2022 మధ్య కాలంలో 85 కోట్ల బినామీ రుణాలు, 85 లక్షల రూపాయల నగదు మాయంపై విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు.