Kakinada incident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బయ్య ఆయిల్ ప్యాకింగ్ మిల్లులో.. 24 అడుగుల ట్యాంక్‌ని శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ట్యాంక్‌ని శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపలికి దిగిన 10 నిమిషాల్లోలోపే ఆక్సిజన్ అందకపోవడంతో.. ఇద్దరూ నిచ్చెన ద్వారా పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరు లోపలే పడిపోయాడు. పైకి వచ్చిన కార్మికుడు లోపల చిక్కుకుపోయిన అతడిని కాపాడేందుకు సాయం కోరగా తోటి కార్మికులతో పాటు స్థానికులు ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు లోపలికి దిగారు. బయటున్న వారు ట్యాంక్‌కు రంధ్రం చేసి లోపల చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందించేందుకు యత్నించగా.. అప్పటికే ఏడుగురు ఊపిరాడక విగతజీవులుగా పడి ఉన్నారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. ట్యాంక్‌కి మరో రంధ్రం చేసి కార్మికుల మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో.. ఐదుగురిని పాడేరు వాసులుగా,. ఇద్దరిని పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో పాడేరుకు చెందిన వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, సాగర్, కె.బంజుబాబు, కుర్రా రామారావు.. పులిమేరుకు చెందిన కట్టమూరి జగదీశ్, ప్రసాద్‌లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు బోరున విలపించారు.
ట్యాంకు శుభ్రం చేసే పనిలో భాగంగానే కార్మికులు లోపలికి దిగారని..అంతలోనే దుర్ఘటన జరిగిందని మిల్లు నిర్వాహకుడు తెలిపారు. నైపుణ్యం లేని కార్మికులు, పర్యవేక్షణ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని కాకినాడ కలెక్టర్ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 50లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, పరిశ్రమ తరఫున రూ.25 లక్షల చొప్పున అందించనున్నారు.
కార్మికులు మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందిన వార్త కలచివేసిందని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యమే ఘటనకు కారణమని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి కార్మికులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నారా లోకేశ్.. మృతులకు నివాళులర్పించారు. ఏడుగురు ఉసురు తీసిన నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
కార్మికులు మృతి చెందడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అధికారులు వారికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఇవీ చదవండి: