Zero Interest Loans For DWACRA Women: మాట్లాడితే చాలు.. తాను మహిళా పక్షపాతినని సీఎం జగన్ గొప్పలు పోతుంటారు. గతంలో ఏ ప్రభుత్వమూ మహిళలకు సాయమే చేయనట్లు.. తాను మాత్రమే వారి సంక్షేమం చూస్తున్నట్లు ఊదరగొడుతుంటారు. ఇక ఆయన అనుచరగణం మరో అడుగు ముందుకేసి.. జగన్ ఓ గొప్ప సంస్కరణవాది అంటూ కీర్తిస్తుంటారు. ఇంతకీ ముఖ్యమంత్రి జగన్ ఏమంత గొప్ప సంస్కరణలు తెచ్చారో.. మహిళలకు ఆయన ఒనగూర్చిన మేలు ఏంటో తెలుసా..? డ్వాక్రా సభ్యులకు గత ప్రభుత్వాలు అమలు చేసిన సున్నావడ్డీ రాయితీని రూ.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు కుదించడం. అదేంటి..? తగ్గిస్తే గొప్ప మార్పు ఎలా అవుతుందంటారా? జగన్ లెక్క ఇలానే ఉంటుంది మరి..! పైగా గతంలో ఈ పథకం రద్దయితే తాను అధికారంలోకి వచ్చాకే మళ్లీ పురుడుపోసినట్లు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేయడం.. జనం ఏం చెప్పినా నమ్ముతారనే భావనకు పరాకాష్ఠ..!
అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య కాలంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల రుణాలకు పావలా వడ్డీ పథకం అమలు చేసింది. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సున్నావడ్డీగా మార్చారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళల రుణం 5 లక్షల రూపాయల వరకు సున్నావడ్డీ వర్తింపజేశారు. ఐదేళ్లలో నిధుల లభ్యతకు అనుగుణంగా 2 వేల 835 కోట్ల రూపాయల మేర సభ్యులకు రాయితీ అందించారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ.. దక్కేది ఎందరికి..?
ఇంకో 2 వేల 100 కోట్ల రూపాయలు బకాయిలుండగా.. తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ బకాయిల్ని చెల్లించకుండా ఎగవేశారు. పైగా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ పథకాన్ని రద్దుచేసినట్లు ప్రచారం చేశారు. 30 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాలు బడుగు, బలహీనవర్గాల ఇళ్ల కోసం ఇచ్చిన రుణాలను ఓపీఎస్ పేరుతో ముక్కుపిండి వసూలు చేసిన జగన్ సర్కారు.. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పక్కన పెట్టేసింది. మహిళా పక్షపాతమంటే జగన్ దృష్టిలో ఇదేనేమో మరి..
రాష్ట్రంలో కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలున్నారు. వీరికి గతంలో అమలు చేసిన సాయాన్ని మరింత పెంచడానికి బదులు.. వైసీపీ ప్రభుత్వం కోత వేస్తుండటం విచిత్రం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల రుణ పరిమితి 10 లక్షల రూపాయలు ఉండేది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద 2021లో ఈ పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచింది.
సున్నా వడ్డీ పథకంతో.. కోటి రెండు లక్షల మందికి లబ్ధి : జగన్
రుణపరిమితి పెరిగితే సభ్యులపై వడ్డీ భారం అధికంగా ఉంటుంది. జగన్ సర్కారు మహిళలకు నిజంగా మేలు చేయాలనుకుంటే.. గత ప్రభుత్వం కన్నా సున్నావడ్డీ వర్తించే మొత్తాన్ని పెంచాలి. కానీ జగన్ అందుకు భిన్నంగా రాయితీ రుణపరిమితిని 5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పరిమితం చేశారు. ఫలితంగా 3 లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకున్న ప్రతి సంఘంపైనా.. గత నాలుగేళ్లలో వడ్డీ భారం భారీగా పడింది.
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు కేంద్ర ప్రభుత్వమే సున్నావడ్డీ పథకం అమలుచేస్తోంది. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలకు ఈ పథకం వర్తిస్తోంది. సంఘాలు 3 లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణానికి 7 శాతం వడ్డీని కేంద్రమే నేరుగా బ్యాంకులకు జమచేస్తోంది. మహిళా సంఘాలు తీసుకునే రుణానికి బ్యాంకులు సరాసరిన 11 శాతం వడ్డీ విధిస్తే.. ఆ ఆరు జిల్లాల్లో 7 శాతం కేంద్రం, 4 శాతం రాష్ట్రప్రభుత్వం భరిస్తున్నాయి.
మిగిలిన జిల్లాల్లో 20 లక్షల రూపాయల రుణపరిమితి మించకుండా ఎంత రుణం తీసుకున్నా.. 3 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భారం భరిస్తోంది. కేంద్రం అమలు చేస్తోన్న 3 లక్షల రూపాయల పరిమితినే ప్రాతిపదికగా తీసుకుని.. వైసీపీ ప్రభుత్వం మహిళలకు గతంలో 5 లక్షల రూపాయల వరకు అమలైన వడ్డీ రాయితీని తగ్గించింది. ప్రస్తుతం ఏటా వైసీపీ ప్రభుత్వం ఈ 6 జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత సంఘాలకు విడుదల చేస్తున్న సున్నావడ్డీ రాయితీలోనూ.. కేంద్రం వాటా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం సాయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.