Zero Interest Crop Loan Scheme in Andhra Pradesh: గతంలో లక్ష రూపాయలు లోపు పంటరుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లిస్తే.. ఆ రైతులకు బ్యాంకులు తక్షణమే సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేసేవి. సున్నా వడ్డీని మినహాయించుకుని.. అసలు వరకే కట్టించుకునేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వెసులుబాటు తీసేశారు. రైతులు వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందే.
ఆ తర్వాత సంవత్సరానికి ఇస్తామంటున్నా.. అదీ జమ అవుతుందో, లేదో తెలియని పరిస్థితి. లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల రుణం తీసుకునే రైతులకు గతంలో పావలా వడ్డీ పథకం అమలు చేయగా.. జగన్ అధికారం చేపట్టాక దాన్నీ ఎత్తేశారు. లక్షలాది మంది రైతులకు.. ఆ ప్రయోజనం కూడా దక్కని పరిస్థితి.
2014-19 మధ్య రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలుగా 11 వేల 595 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వమే చెప్పిందనేది జగన్ మాట. అయితే ఆయన ఏలుబడిలో 2019 ఖరీఫ్ నుంచి 2021 ఖరీఫ్ వరకు రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 55 వేల 423 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. దీనికి సున్నా వడ్డీ ప్రకారం 10 వేల 217 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆయన ఇచ్చింది 658 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి 250 కోట్ల లోపే.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 వరకు పరిశీలిస్తే.. రైతులకు 6.03 లక్షల కోట్ల పంట రుణాలను అందించినట్లవుతుంది. దీనికి సున్నా వడ్డీగా 24 వేల120 కోట్లు జమ చేయాలి. ఇప్పటికైతే ఇచ్చింది 658 కోట్లు మాత్రమే. 2021-22 రబీ, 2022 రబీ సొమ్ము ఇంకా విడుదల చేయలేదు. 2021-22 రబీ, 2023 ఖరీఫ్ సున్నా వడ్డీ సొమ్ములూ కొత్త ప్రభుత్వమే ఇవ్వాలి.
వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ.. దక్కేది ఎందరికి..?
జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ఖరీఫ్, రబీకి కలిపి 382 కోట్లు విడుదల చేశారు. తర్వాత ఏడాది అందులో సగం కూడా ఇవ్వలేదు. 2016-17 సంవత్సరంలో రైతులకు ఇచ్చిన 58 వేల 840 కోట్ల పంట రుణాలకు.. సున్నా వడ్డీగా ప్రభుత్వం 2వేల 354 కోట్లు చెల్లించాలి. 2018-19 సంవత్సరంలో రైతులు తీసుకున్న 76 వేల 721 కోట్ల పంట రుణాలకు 3 వేల 69 కోట్లను సున్నా వడ్డీగా జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్ 2019 జులైలో అసెంబ్లీలో చెప్పారు.
తీసుకున్న మొత్తం రుణాలపై 4 శాతం వడ్డీ చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉన్నా.. అప్పటి ప్రభుత్వం జమ చేయలేదని అప్పట్లో ఆయన విమర్శించారు. జగన్ లెక్కల ప్రకారమే చూస్తే.. 2019-20 సంవత్సరంలో రైతులు తీసుకున్న 89 వేల 273 కోట్ల పంట రుణాలకు సున్నా వడ్డీగా ప్రభుత్వం 3 వేల 571 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చింది 382 కోట్లు మాత్రమే. 2020-21 సంవత్సరంలో ఇచ్చిన లక్షా 9 వేల 210 కోట్ల రుణాలకు సున్నా వడ్డీ కింద 4 వేల 368 కోట్లు రైతులకు జమ చేయాలి.
అయితే 160 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. అంటే 3.66 శాతం మాత్రమే. గత కొన్నేళ్లుగా పంటల పెట్టుబడులు భారీగా పెరిగాయి. మిరప సాగు చేయాలంటే ఎకరాకు రెండు నుంచి రెండున్నర లక్షలపైనే పెట్టుబడి అవుతోంది. వరి సాగుకు కూడా ఎకరా 45 వేల వరకు చేరింది. అయినా లక్ష లోపు రుణానికే సున్నా వడ్డీ అని ప్రభుత్వం పాతపాటే పాడుతోంది.
కౌలు రైతులకు భరోసా హామీని విస్మరించిన జగన్ - హామీల్లో 99% అమలు చేయడమంటే ఇదేనా?