మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరులో వైకాపా నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి హిందూ కళాశాల కూడలిలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ వెళ్లారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. తన స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు అమరావతి ఉద్యమం చేపట్టారన్నారు. గ్రాఫిక్స్‌లో డిజైన్లు తప్ప.. తెదేపా ప్రభుత్వ పాలనలో చేసిందని ఏమి లేదని పేర్కొన్నారు.
మూడు రాజధానాల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెదేపా అధికారంలో ఉన్నపుడు మాయమాటలు చెప్పి రైతులను మోసగించారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి... దిల్లీ, సింగపూర్ టూర్లు అంటూ కాలయాపన చేశారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న ఎస్ఈబీ అధికారులు..యజమానుల నిరసన