YSRCP Leaders Distributing Cash to Voters: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. అధికార వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ఓటర్లను కొనుగోలు చేసేందుకు.. బహిరంగంగానే డబ్బుకట్టలు, బహుమతులతో రోడ్ల మీదపడ్డారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటుకు వెయ్యి, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటుకు 5 వేల రూపాయల చొప్పున లెక్కగట్టి పంపిణీ చేశారు.
బహిరంగంగానే సవాల్: పట్టపగలే వాటిని పంచుతూ అడ్డంగా దొరికినా.. జేబుల నిండా నోట్ల కట్టలతో పట్టుబడినా.. అధికారపక్ష నేతలు, కార్యకర్తల్లో అదురూ బెదురూ లేదు. కావాలంటే పోలీసుస్టేషన్‌కు తీసుకుపొమ్మంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా.. పట్టుకుని నేరుగా అప్పగించినా కొన్ని చోట్ల పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే వదిలేస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధులే నగదు పంపిణీని స్వయంగా పర్యవేక్షించడం విస్తుగొలుపుతోంది.
మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో: అనంతపురం జిల్లాలో ఏకంగా మంత్రి ఉషశ్రీ చరణ్ నగదు పంపిణీ గురించి మాట్లాడుతున్న వీడియోను తెలుగుదేశం, బీజేపీ నేతలు విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డ మంత్రి ఉషశ్రీని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో గుర్తించిన బోగస్ ఓట్లను జాబితా నుంచి తొలగించాలని టీడీపీ, సీపీఎంల నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
వాలంటీర్ల ఆధ్వర్యంలో?: రాష్ట్రంలో చాలా చోట్ల వాలంటీర్ల ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది కూడా నగదు పంపిణీలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. విశాఖ 40వ వార్డు ఏకేసీ కాలనీలో వైఎస్సార్ అర్బన్ క్లినిక్ వద్ద కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగానే ఇళ్లపట్టాలు పంపిణీ చేసినట్లు ప్రతిపక్షాలు ఆధారాలతో సహా స్పష్టం చేశాయి. విశాఖ హెచ్‌బీ కాలనీలోని భానునగర్ దగ్గర వైఎస్సార్సీపీకు చెందిన ఎంపీ నిర్మాణ సంస్థలో పనిచేసే ఈశ్వరరావు అనే వ్యక్తి డబ్బు పంపిణీ చేస్తూ పీడీఎఫ్ కార్యకర్తలకు పట్టుబడ్డారు. ఆయన జేబుల్లో నుంచి 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. 83 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
వెండి నాణేలు: పార్టీ కార్యాలయంలో లక్ష రూపాయలు ఇచ్చి పంపిణీ చేయమన్నారని.. వాలంటీరు ఒక జాబితా ఇచ్చారని ఆయన తహసీల్దార్‌కు చెప్పారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో నగదు పంపిణీ జోరుగా సాగుతోంది. కొన్నిచోట్ల వెండి నాణేలను కూడా పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఓటు ఉన్న వారు తమ వివరాలు పంపాలని విశాఖలోని వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు చెందిన గ్రూప్‌లో సందేశాలు పెడుతున్నారు. వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు వైసీపీ నేతలు ఫోన్ చేసి.. మొదటి ప్రాధాన్య ఓటు వైసీపీకు వేసి.. రెండు, మూడు ప్రాధాన్య ఓట్లు ఎవరికీ వేయవద్దని చెబుతున్నట్లు తెలిసింది.
ఫోన్‌పే, గూగుల్ పే: తిరుపతి యశోదనగర్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వామపక్ష పార్టీల నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డబ్బులు పంచుతూ దొరికిపోయినవారిని పోలీసులకు అప్పగించినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. ధర్నా నిర్వహించారు. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా.. ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లకు 3 వేల నుంచి 5 వేలు, పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు నగదు బదిలీ చేశారు.
సీఎం సొంత నియోజకవర్గంలో జోరుగా: కొన్ని చోట్ల వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయగా.. మరికొన్ని చోట్ల గృహసారథులు ఇంటింటికీ వెళ్లి డబ్బు పంచారు. ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో డబ్బుల పంపిణీ జోరుగా సాగింది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని ఓటర్లకు వైసీపీ నాయకులు వెండి నాణేలను పంపిణీ చేశారు. దీంతో పాటు ఓటుకు వెయ్యి రూపాయలిచ్చారు. నాణేనికి ఒక వైపు బీకేసీ మరోవైపు ఐదుగురి దేవతల చిత్రాలు ముద్రించి ఉన్నాయి. ఒక్కో నాణెం సుమారు 12 గ్రాముల బరువు ఉంటుందని తెలిసింది.
వాలంటీర్లకు షోకాజ్ నోటీసు: చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో నలుగురు వాలంటీర్లకు కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని శ్రీకాకుళం జిల్లాలోని పోలీసు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ల ఏర్పాటులోనూ అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదులు చేశారు.
"పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రి ఉషశ్రీ ఆధ్వర్యంలో డబ్బు పంపిణీ ఏర్పాటు చేస్తున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో.. మంత్రి ఉషశ్రీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కోట్లలో నగదు పంపిణీ చేస్తూ గెలవాలని చూస్తున్నారు". - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: