YSRCP Infighting on Incharges Change: నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు, మంటలతో మంగళవారం ప్రకటించాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్తల మూడో జాబితా నేటికి వాయిదా పడింది. సీట్లు రాని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేస్తుండగా వారిని సముదాయించే బాధ్యతలను వైెస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు తలకెత్తుకున్నారు. కానీ, సీఎంతో ఏదైనా తేల్చుకుంటామని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. వారిలో కొందరితో సీఎం జగన్ నేరుగా మాట్లాడినా ఫలితం దక్కలేదని సమాచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో స్వయంగా ముఖ్యమంత్రే సోమవారం మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ మంగళవారం సంప్రదించినా సర్దుబాటు కుదరలేదు. రాత్రి తెలుగుదేశం పార్టీ నేతలు పార్థసారథితో భేటీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ మరోసారి పార్థసారథిని కలిసినా వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.
మార్పు మొదలైంది - వైసీపీ కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో అసంతృప్తి సెగలు
వారి మధ్య సయోధ్య భాద్యతలు సజ్జలకు: విజయవాడ పశ్చిమ నుంచి సెంట్రల్‌కు వెలంపల్లి శ్రీనివాస్‌ను ఇటీవల జగన్ మార్చారు. సెంట్రల్‌కు వెళ్లడం వల్ల అక్కడి ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో ఎదురయ్యే ఇబ్బందులపై వెలంపల్లి ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. వారి మధ్య సయోధ్య కుదుర్చాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం చెప్పారు. తర్వాత మల్లాది విష్ణును, వెలంపల్లితో సహా సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని సజ్జల, ఇతర పెద్దలు మాట్లాడినా లాభం లేకపోయింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మంగళవారం సీఎంవో నుంచి పిలుపువచ్చింది. ఎమ్మెల్యే, ఆమె భర్త సాంబశివారెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అలా మాట్లాడడం వెనక అంతరంగాన్ని వారు సీఎంకు వివరించినట్లు తెలిసింది.
వైసీపీ ఇంచార్జ్‌లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం
సీఎంను కలిసిన హిందుపురం ఎంపీ: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్యమంత్రిని కలిశారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి సమన్వయకర్తగా శాంత పేరును ఇప్పటికే ప్రకటించినందున తనకు వేరే ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలోనో, లోక్‌సభ స్థానంలోనో టికెట్ ఇవ్వాలని మాధవ్ సీఎంను కోరారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగేందుకు పోలీసు అధికారి ఉద్యోగాన్నీ వదిలేశానని, ఇప్పుడు ఏ సీటూ లేకుండాపోతే నష్టపోతానని చెప్పినట్లు సమాచారం. అయితే సీటు విషయమై ఎలాంటి హామీనివ్వని జగన్, సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతోందని, చూద్దామని చెప్పినట్లు తెలిసింది. దీంతో అసహనంగానే ఆయన వెనుదిరిగారు.
స్పష్టత రాని అనకాపల్లి లోక్‌సభ స్థానం: అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనే యోచనలో ఆమె ఉన్నారు. అసెంబ్లీ టికెట్‌పై స్పష్టత లేకుండానే తన సిట్టింగ్ ఎంపీ స్థానంలో మరొకరిని తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్ఠానం ప్రయత్నాలపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
అనకాపల్లిలో ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్థానంలో భరత్‌ను నియమించారు. గతంలో యలమంచిలికి వెళ్లాలనుకున్నా ఆయనకు కుదరలేదు. తర్వాత గాజువాక, పెందుర్తి వైపు చూస్తున్నట్లు ప్రచారమైంది. గత నెలలోనే ఆయన సమీప బంధువైన వరికూటి రామచంద్రరావును గాజువాక సమన్వయకర్తగా సీఎం నియమించారు. దీంతో అమర్‌నాథ్ ఇప్పుడు పెందుర్తికి వెళతారా? లేదా అనకాపల్లి లోక్‌సభ వైపు మళ్లే అవకాశముందా? అనేది చర్చనీయాంశమైంది. అనకాపల్లి లోక్‌సభ సమన్వయకర్తగా బోడ్డేడ ప్రసాద్ పేరూ పరిశీలనలో ఉందంటున్నారు. దీంతో అనకాపల్లి లోక్‌సభ సీటుపై స్పష్టత రాలేదు.
వైఎస్సార్సీపీ పెద్దలను కలిసిన చింతా: అమలాపురం ఎంపీ చింతా అనూరాధ అధిష్ఠాన పెద్దలను కలిశారు. ఆమె ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పి. గన్నవరం ఆశించినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్‌కు ఇచ్చారు. ఇప్పుడు ఎంపీకి అమలాపురం, రాజోలులో ఒక సీటు ఇచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. విజయనగరం ఎంపీ సీటును చిన్న శీనుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినందున మంత్రి బొత్స సత్యనారాయణను పిలిపించుకుని మాట్లాడారు.
సీఎంను కలిసిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు: విశాఖ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ పేరు పరిశీలనలో ఉన్నట్లు విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ రెండు విషయాలపై సీఎం, మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా మంగళవారం సీఎంను కలిశారు.
ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా