YSRCP Government Ignored Amaravati Development : రాజధాని అమరావతిపై అడుగడుగునా జగన్ సర్కార్ అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. కోర్టులు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. పనులు చేపట్టకుండా వదిలించుకోవాలని చూస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గతేడాది తూతూమంత్రంగా కొన్ని పనులు ప్రారంభించి.. తర్వాత వాటిని ఆదిలోనే వదిలేసింది. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకే పనుల చిత్రాలు, నిధుల వివరాలను.. అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించి చేతులు దులిపేసుకుంది. తమనే కాకుండా కోర్టుల్ని కూడా ప్రభుత్వం మోసగిస్తోందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు.
రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ 28వేల 587 మంది రైతుల నుంచి.. 34వేల 385 ఎకరాలను సమీకరించింది. ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు మొత్తం 64వేల 735 ప్లాట్లు కేటాయించింది. ఇందులో 38వేల 282 నివాస, 26వేల 453 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 40వేల 378 ప్లాట్లను రైతుల పేరుతో రిజిస్టర్ చేశారు.
కంటితుడుపు చర్యలకు దిగిన ప్రభుత్వం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టుల్లో కేసులు వేయడంతో గతేడాది మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకా 21వేల 206 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వాటిని అభివృద్ధి చేసి ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన తీర్పివ్వడంతో ప్రభుత్వం గతేడాది కంటితుడుపు చర్యలను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది.
కేవలం ఫొటోలతో: ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల పనుల కోసం 16వేల400 కోట్ల రూపాయల అంచనాలతో 13 జోన్లుగా విభజించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. 11 జోన్లకు సంబంధించి టెండర్లు వేసి.. గుత్తేదారులను కూడా ఖరారు చేశారు. ప్లాట్ల వద్ద రహదారులు, విద్యుత్తు స్తంభాలు, తాగునీరు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజి, తదితర మౌలిక వసతుల కల్పన అంటూ.. గతేడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర కంప తొలగించారు. వాటిని ఫొటోలు తీసుకుని.. పనులు ప్రారంభించామంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది.
అమరావతి నిర్మాణానికి లక్షా 9వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని.. ఇందులో 66 వేల కోట్ల పనులకు అంచనాలు తయారుచేశామని జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఇప్పటికే 46 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఎల్పీఎస్ లేఅవుట్లలో 16వేల400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో పేర్కొంది. అయితే ప్రారంభించిన పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్పటి నుంచి అటువైపు సీఆర్డీఏ అధికారులు కన్నెత్తైనా చూడటంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే: జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మళ్లీ ముళ్లకంప పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం 3వేల 500 కోట్ల రుణానికి రెండేళ్ల కాలపరిమితితో గ్యారంటీ ఇచ్చింది. రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే.. రుణాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖకు పరిపాలనను మార్చే ఉద్దేశంతో ఉన్న జగన్ ప్రభుత్వం అమరావతిలో నిధులు వెచ్చించడం ఇష్టం లేకే పక్కన పడేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కోర్టు తీర్పు కారణంగా తూతూమంత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నట్లు సీఆర్డీఏ నటించిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా రాజధానిలోని భూములను వేలానికి పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
High Court on R5 Zone: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే