YSRCP Govt Destroyed IT Sector In Andhra Pradesh: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రంగాల్లోనూ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేది. కానీ.. 2019లో విధ్వంసంతో పాలన మొదలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ రంగం నిలదొక్కుకోడానికి అనువైన వాతావరణాన్ని కూడా ధ్వంసం చేసింది. అధికారం చేపట్టి వైసీపీ గద్దెకి ఎక్కడంతోనే.. విశాఖలోని స్టార్టప్ విలేజ్‌ను మూసేసింది. ఈ చర్యతో అంకుర సంస్థలను ఎదగకుండా చిదిమేసింది. ప్రభుత్వానికి ఐటీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం ఏ మాత్రం లేదనే సంకేతాలను విశాఖ చర్యతో తేటతెల్లం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ గణాంకాలే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలో ఈ సంవత్సరం జులై 19 వరకు నమోదైన అంకుర సంస్థల జాబితాను డీఐఐపీ వెల్లడించింది. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లాన్నింటితో పోల్చితే.. మన రాష్ట్రానికి 15వ స్థానం దక్కింది. మొత్తం 99వేల 380 అంకురాలు ఇప్పటి వరకు భారత్‌లో నమోదయ్యాయని.. డీఐఐపీ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నిలిచినట్లు వెల్లడించింది.
దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు వరుసగా 5, 7, 8 స్థానాల్లో నిలిచాయి. బిహార్ మనకంటే రెండు స్థానాల ముందే ఉంది. ఎడారి రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్ సైతం టాప్ 10లో ఉంది. డీఐఐపీ వెల్లడించిన జాబితాలో మన తర్వాత స్థానాల్లో చిన్న రాష్ట్రాలే ఉన్నాయి. కొండ ప్రాంతాలతో నిండిన ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే. ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పోటీ పడే స్థాయిలో ఉన్న మన రాష్ట్రం.. ఇప్పుడు చిన్న రాష్ట్రాలతో పోటీ పడాల్సిన దుస్థితికి దిగజారింది.
గత ప్రభుత్వం విశాఖలో స్టార్టప్ విలేజ్ ప్రారంభించింది. ఇందులో యాబై వరకు అంకుర సంస్థలు నేరుగా.. మరో 80 సంస్థల వరకు వర్చువల్ విధానంలో కార్యకలాపాలు ప్రారంభించాయి. సింగపూర్ కంపెనీతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాస్కామ్ విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేసేలా అప్పటి ప్రభుత్వం సమన్వయం చేసింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ.. స్టార్టప్లను ప్రోత్సహించి, రాష్ట్రంలో మళ్లీ ఐటీ రంగానికి గుర్తింపు వచ్చే దశకు చేరింది.
2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖలో స్టార్టప్ విలేజ్‌ను మూసేసింది. పలు స్టార్టప్లు, సంస్థలు, విశాఖలోని హెచ్ఎస్బీసీ, ఐబీఎమ్ వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాయి. విప్రో, టెక్ మహీంద్ర సైతం కార్యకలాపాలను పరిమితం చేసుకున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకపోవటమే కాకుండా, ఉన్న సంస్థలు వెళ్లిపోతున్న కుడా పట్టించుకోకపోవటమంటే.. ప్రభుత్వం ఏటీ రంగంపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది.
ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టార్టప్లను ప్రోత్సహించే మెంటార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.