గుంటూరు జిల్లా నాదెండ్ల మండల పరిధిలోని కనపర్రులో తెదేపా వర్గీయులపై వైకాపాకు చెందిన వారు జరిపిన దాడిలో తాత మనవడు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కనపర్రు హరిజన కాలనీకి చెందిన తెదేపా నేత చెవుల లక్ష్మీనరసయ్య కుటుంబ సభ్యులకు చెందిన గేదెలు రోడ్డుపై తమ ఇళ్ల ఎదురు పేడ వేశాయని పదిరోజుల క్రితం వైకాపా వర్గీయులు గొడవపెట్టుకున్నారు. ఈ విషయమై రెండు వర్గాల మధ్య బుధవారం మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అదేరోజు రాత్రి లక్ష్మీనరసయ్య, అతని మనవడు రామారావుపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వీరి ఇంట్లోని మహిళలను కూడా విచక్షణారహితంగా కొట్టడంతో భయాందోళన చెందారు. క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ఘటనపై బాధితులు నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై కేవీ.నారాయణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: శంకర్‌విలాస్ వంతెన అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: ఎమ్మెల్యే గిరిధర్‌రావు