Young Boy 3D Art with Technology: రూపానికి ప్రతిరూపం శిల్పకళ. మనదేశంలోని పురాతన వృత్తుల్లో శిల్పకళ కూడా ఒకటి. మారుతున్న పోకడలు, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కళలోనూ అనివార్యంగా మార్పులొస్తున్నాయి. వాటిని ఒడిసిపట్టుకుని పురాతన శిల్పకలకు.. ఆధునికత జోడించి తనదైన ముద్ర వేస్తున్నాడు ఆ యువకుడు. వారసత్వంగా వచ్చిన కళకు నవీన పోకడలద్ది గుర్తింపు తెచ్చుకున్న యువకుడిపై ప్రత్యేక కథనం.
కళల కాణాచిగా గుంటూరు జిల్లా తెనాలికి పేరుంది. ముఖ్యంగా శిల్పకళకు సంబంధించి ఈ ప్రాంతంలో బలమైన పునాదులున్నాయి. ఎందరో కళాకారులు ఇక్కడి నుంచి ఎదిగి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించారు. ఇప్పుడు కొత్తతరం శిల్పకారులు తయారవుతున్నారు. అలా వచ్చిన వాడే ఈ యువకుడు.
ఈ యువకుడి పేరు కాటూరి శ్రీహర్ష. గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం. తాత, ముత్తాతల కాలం నుంచి శ్రీహర్ష కుటుంబం శిల్పాల తయారీలోనే ఉంది. అదే వారసత్వం కొనసాగిస్తున్నాడు శ్రీహర్ష. తండ్రి వెంకటేశ్వరరావు శిల్పాల తయారీలో పేరొందగా.. సోదరుడు రవిచంద్ర ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలు రూపొందించటంలో ముద్రవేశాడు. శ్రీహర్ష సైతం శిల్పకళలోనే భిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. త్రీడీ సాంకేతికతో విగ్రహాలు రూపొందిస్తున్నాడు.
కంప్యూటర్లోనే శిల్ప ఆకృతి, కొలతలు, ఇతర డిజైన్ చేసి త్రీడి ప్రింటింగ్ ద్వారా విగ్రహాల తయారీ శ్రీహర్ష ప్రత్యేకత. భారీ విగ్రహాలను సైతం ఈ పరిజ్ఞానంతో రూపొందించటంలో ప్రత్యేక సాధించారు. సంక్లిష్టమైన విగ్రహాలను కూడా ఈ పరిజ్ఞానంతో రూపొందించటం వీలవుతుందని తెలిపారు. అలా ఎద్దుల విగ్రహాల్ని రూపొందించి వావ్ అనిపిస్తున్నాడు.
"కంప్యూటర్లోనే శిల్ప ఆకృతి, కొలతలు, ఇతర డిజైన్ చేసి త్రీడి ప్రింటింగ్ ద్వారా విగ్రహాలను మేను తయారుచేస్తాం. భారీ విగ్రహాలను సైతం ఈ పరిజ్ఞానంతో రూపొందిస్తాం. సంక్లిష్టమైన విగ్రహాలను కూడా ఈ పరిజ్ఞానంతో రూపొందించటం వీలవుతుంది. అలా ఎద్దుల విగ్రహాల్ని కూడా రూపొందించాము. నైపుణ్యాలు మెరుగుపర్చుకునే క్రమంలో ఓ విదేశీ సంస్థలో అవకాశం వచ్చింది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఇతర దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేసేందుకు సౌదీఅరేబియాకు వెళ్తున్నాను. త్వరలో మోడ్రన్ ఆర్ట్ విగ్రహాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను." - కాటూరి శ్రీహర్ష, శిల్పి
మనదేశంలో శిల్పకల అనగానే పురాతన విగ్రహాలు, ప్రముఖుల శిల్పాలు వీటికే పరిమితం. ఇటీవల మోడ్రన్ ఆర్ట్ ప్రకారం శిల్పాల తయారీ మొదలైంది. శ్రీహర్ష కూడా మోడ్రన్ ఆర్ట్‌కు సంబంధించిన శిల్పాలు త్రీడి పరిజ్ఞానంతో రూపొందించటంలో పని చేస్తున్నారు. సంబంధిత నైపుణ్యాలు మెరుగుపర్చుకునే క్రమంలో ఓ విదేశీ సంస్థలో అవకాశం వచ్చింది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఇతర దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేసేందుకు సౌదీఅరేబియాకు వెళ్తున్నాడు. త్వరలో మోడ్రన్ ఆర్ట్ విగ్రహాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు.
శ్రీహర్ష మెషిన్‌తో విగ్రహాలు చేస్తానని చెప్పినప్పుడు ఆ ప్రతిపాదన కొట్టిపారేశానని, కానీ అతడు ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు తండ్రి వెంకటేశ్వరరావు. త్రీడీ విగ్రహాల తయారీలో శ్రీహర్ష చూపించిన ప్రతిభ గుర్తించిన పలు సంస్థలు అతడ్ని ఘనంగా సన్మానించాయి. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో ఇటీవల పురస్కారం కూడా అందజేశారు.